యూట్యూబ్ ఛానల్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ఓ గవర్నమెంట్ టీచర్ 1-8వ తరగతి వరకు క్వశ్చన్ పేపర్ లీక్ చేశాడు. తన భార్య పేరు మీద ఛానల్ ఓపెన్ చేసి ప్రశ్నలను అందులో అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఉపాధ్యాయుడు, అతని భార్య, మరో వ్యక్తిని ఈ కేసులో అరెస్టు చేశారు. పరీక్షలకు ముందు క్వశ్చన్ పేపర్లు యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయంటూ ఒడిశా స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అథారిటీ డైరెక్టర్ మార్చి 18వ తేదీన భువనేశ్వర్ సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు గంజాం జిల్లాలోని రంభ అనే ప్రాంతానికి చెందిన సమీర్ సాహుని నిందితుడిగా గుర్తించారు. సమీర్ తన యూట్యూబ్ ఛానల్ ‘సమీర్ ఎడ్యుకేషనల్’లో క్వశ్చన్ పేపర్ అప్‌లోడ్ చేసినట్లు తెలియడంతో ఆయన ఇంటిపై దాడి చేసి మార్చి 30వ తేదీన అతని దగ్గర ఉన్న ప్రశ్నపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తన ఛానల్‌తో పాటు ‘ప్రో ఆన్సర్’ అనే మరో యూట్యూబ్ ఛానల్‌లో కూడా ప్రశ్నపత్రాలు అప్‌లోడ్ చేసినట్లు పోలీసుల విచారణలో సమీర్ చెప్పాడు.