చైనాతో భారత్ సంబంధాలపైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ – చైనా మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు రెండు ప్రాంతాలకు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు అత్యంత కీలకమని అన్నారు. సరిహద్దుల అంశంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన దౌత్య, సైనిక స్థాయుల్లో సానుకూల, నిర్మాణాత్మక చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. ఆర్థిక వ్యవస్థ దూసుకెళుతోంది. దౌత్యపరంగా, శాస్త్రీయంగా, సైనికశక్తిపరంగా ఎదుగుతున్న తీరు భారత్‌ను ఓ వర్ధమాన ‘సూపర్ పవర్’గా నిలబెడుతోంది. చైనాతో సంబంధాలు భారత్‌కు చాలా ముఖ్యం. ఇరు దేశాల మధ్య సరిహద్దుల విషయంలో దీర్ఘకాలంగా నెలకొన్న పరిస్థితి వేగంగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను. ఈ సమస్య పరిష్కారమైతే మా ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోతుంది’ అని ప్రధాని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్‌లతో ఏర్పడిన క్వాడ్ కూటమి ఏ ఒక్క దేశానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికలు, క్వాడ్, రామమందిరం తదితర అంశాల గురించి కూడా ఆయన ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు.