భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ తొలి అధికారిక పర్యటన ఖరారైంది. జూన్ 18వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసికి ఆయన వెళ్లనున్నారు. ప్రధానిగా హ్యాట్రిక్ విన్ కొట్టిన తర్వాత ఆయన వారణాసికి తొలిసారిగా వెళ్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడ ఆయన ‘కిసాన్ సమ్మేళన్’ లో పాల్గొనే అవకాశం ఉందని వెల్లడించాయి.
వారణాసిలోని రోహానియా లేదా సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గంలో రైతుల సదస్సు నిర్వహించే అవకాశం ఉన్నట్లు స్థానిక బీజేపీ నేతలు తెలిపారు. వేదిక ఏర్పాటుకు స్థలం ఎంపిక జరుగుతోందని .. ప్రధాని మోదీ వారణాసి పర్యటనకు సంబంధించి ఏర్పాట్ల కోసం గులాబ్ బాగ్‌లోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధికారుల సమావేశం జరిగిందని చెప్పారు. టెంపుల్ టౌన్‌లో ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దశాశ్వమేధ ఘాట్‌లో గంగా హారతిలో పాల్గొంటారని కాశీ ప్రాంతానికి బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న దిలీప్ పటేల్ తెలిపారు. అందుకు తగిన సన్నాహాలు ప్రారంభించామన్నారు.