ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 13, 14వ తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనకు వెళ్లనున్నారు. తొలి రోజున యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌తో సమావేశమై విస్తృత చర్చలు జరుపుతారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే రాజధాని నగరమైన అబుధాబిలో నిర్మించిన తొలి హిందూ ఆలయాన్ని మోదీ ప్రారంభిస్తారని పేర్కొంది. ఈ సందర్భంగా అక్కడ ఉంటున్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతారని చెప్పింది.
2015 నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ ఆరు సార్లు యూఏఈలో పర్యటించారు. ఇక తాజా పర్యటన ఖరారు కావడంతో యూఏఈలో ఇది ప్రధాని జరపనున్న ఏడో పర్యటనగా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మోదీ, అల్ నహ్యాన్ భేటీలో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడం, బలోపేతం చేయడంపై నేతలిద్దరూ చర్చిస్తారని పేర్కొంది. ఉభయులకూ ప్రయోజనకరమైన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నట్లు తెలిపింది. దుబాయ్ కేంద్రంగా జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ – 2024కు గౌరవ అతిథిగానూ ప్రధాని హాజరై ప్రసంగిస్తారు.