ప్రధాన మంత్రి ఫసల్ (పంట) బీమా పథకం సేవలను రైతులకు డిజిటల్ పద్ధతిలో అందించడానికి కేంద్ర సర్కార్ సారథి అనే పోర్టల్ ను తీసుకువచ్చింది. ఈ పోర్టల్ లో ఈ పథకంతోపాటు పలు బీమా ఉత్పత్తులు, సేవలు రైతులకు అందుబాటులో ఉండనున్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. పంటల బీమా పథకానికి సంబంధించి రైతుల ఫిర్యాదులను పరిష్కరించడానికి కిసాన్ రక్షక్ పోర్టల్‌నూ, 14447 నంబరు హెల్ప్ లైన్‌నూ ప్రారంభించినట్లు వెల్లడించారు.
ఫసల్ బీమా, సవరించిన వడ్డీ సబ్సిడీ పథకం, కిసాన్ క్రెడిట్ కార్డుల గురించి రైతులకు సమాచారం అందించే ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఏక గవాక్ష సారథి పోర్టల్ రైతులకు డిజిటల్ పంథాలో పంట బీమా పొందే సౌకర్యాన్ని అందిస్తుందని వెల్లడించారు. ఈ పోర్టల్‌లో బీమా పథకాలను పరిశీలించి, కొనుగోలు చేయవచ్చని.. డిజిటల్ పద్ధతిలో ప్రీమియం చెల్లించవచ్చని చెప్పారు. సారథి పోర్టల్‌లో మొదటి దశలో ఆసుపత్రి నగదు, వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యాలను కల్పిస్తుండగా.. రెండో దశలో ఆరోగ్య, దుకాణ, గృహ బీమా సౌకర్యాలను అందిస్తారు. ఇక మూడో దశలో పంటల బీమాకు భిన్నమైన ట్రాక్టరు, ద్విచక్ర వాహన, పశు బీమా వంటివి అందిస్తారు.