పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై రోజురోజుకీ ఆందోళనలు తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఉదాంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటన జరిగి 20 రోజులు కావస్తున్న దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఈ ఘటనను ఖండిస్తూ పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టడం.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో గర్షణ నెలకొంటుంది.
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా నేడు బిజెపి 12 గంటల బంద్ కి పిలుపునిచ్చింది. తాజాగా హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టీఎంసీ విద్యార్థి విభాగ ఆవిర్భావ దినోత్సవాన్ని కోల్కతా హత్యాచార ఘటనలో బలైన జూనియర్ డాక్టర్ కి అంకితం ఇస్తున్నట్లు బుధవారం (ఎక్స్) వేదికగా ప్రకటించారు.
ఇక ఈ ఘటనపై తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఓ భయానక ఘటన అని.. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలన్నారు రాష్ట్రపతి. పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రపతి ఈ విధంగా స్పందించారు.