బుధవారం ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా రాష్ట్రంలో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన సరిగా లేదని.. వీరి ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచి పేరు దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా మంత్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
జిల్లాల్లో ఎమ్మెల్యేలు, నాయకులను మంత్రులు గైడ్ చేయాలని సూచించారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవలసిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదేనని అన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో ఇసుక వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఇప్పటికే ప్రతి కేబినెట్ భేటీలోనూ సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నప్పటికీ.. వారు మారకపోవడంతో ఆ ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ భేటీలో వారి గురించి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. అయితే ఆ ఎమ్మెల్యేలు ఎవరనేది మాత్రం వివరాలు వెల్లడి కాలేదు. అలాగే ప్రభుత్వంలో కీలకమైన సమాచారం బయటకు పోతుందని.. శ్వేత పత్రాల్లో సమాచారం, ఇతర కీలకమైన నిర్ణయాలు బయటకు పొక్కడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.