ఒడిశాలో ఇవాళ్టి నుంచి పూరీ జగన్నాథుని రథయాత్ర ప్రారంభం కానుంది. జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా… పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి చేరుకోనున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి జగన్నాథుడు, అమ్మవార్లు బలభద్ర, సుభద్ర రథాలను ఇప్పటికే అలంకరించారు. మూడు రథాలు నందిఘోష, తాళధ్వజం, దర్పదాళనలను పూరీ శ్రీమందిరం సింహద్వారం వద్దకు చేర్చారు. ఈ రథయాత్రలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్కొననున్నారు.
గర్భగుడిలోని దివ్య(దారు) విగ్రహాలు భక్త జనఘోష మధ్య రథాలపై మూడు కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధికి చేరుకుంటాయి. జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. నలుమూలల నుంచి ఈ రథయాత్ర సందర్శనకు వచ్చే భక్తుల కోసం రైల్వే శాఖ 315 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
ఈరోజు నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ రథయాత్రలో లక్షల మంది భక్తులు ఆ జగన్నాథున్ని దర్శించుకుంటారు. ఈ ఏడాది యాత్ర జరిగే క్రతువు రెండు రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం జులై 7, 8 తేదీల్లో సెలవులు ప్రకటించింది. రథ యాత్రలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు.