రాజస్థాన్లో పట్టపగలే బ్యాంకు దోపిడీ జరిగింది. ముసుగు ధరించి బ్యాంకులోకి వచ్చిన ఓ ఆగంతుకుడు.. బాంబుతో సిబ్బందిని బెదిరించి రూ.24 లక్షలతో పరారయ్యాడు. జైపుర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మాస్కు ధరించిన ఓ దుండగుడు గురువారం రోజున జైపుర్ లోని హర్‌సావా ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు బ్యాంకులోకి ప్రవేశించాడు. బ్యాంకులో ఉన్న సొమ్మంతా తనకు ముట్టజెప్పాలని సి.. లేదంటే తన వద్ద ఉన్న బాంబును పేల్చేస్తానని బెదిరించాడు. భయపడ్డ బ్యాంక్ సిబ్బంది మొదట రూ.1.25 లక్షలు దుండగుడికి తీసిచ్చారు. వాటితో సంతృప్తి చెందని దొంగ.. మరింత డబ్బును డిమాండ్ చేశాడు.
ఈ క్రమంలోనే క్యాషియర్ గదిలోకి ప్రవేశించిన దుండగుడు.. మొత్తం 24 లక్షల రూపాయల వరకు బ్యాగులో సర్దేశాడు. అనంతరం సిబ్బందిని లోపలే ఉంచి.. బ్యాంకు మెయిన్ గేటుకు తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు దొంగ. దోపిడి జరిగిన సమయంలో బ్యాంకు లోపల కస్టమర్లెవ్వరూ లేరని సిబ్బంది తెలిపారు. ఘటన అనంతరం బ్యాంకు సిబ్బంది పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని పట్టుకునే పనిలో పడ్డారు.