అస్సాంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. అందులో భాగంగా నేతలు ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టేశారు. ప్రస్తుతం అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. దీంతో ఈసారి ఎలాగైనా సరే అక్కడ పాగా వేసి సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ శతవిధాలా యత్నిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు అస్సాంలో ప్రచారాన్ని వేగవంతం చేశారు.
ఇక కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అస్సాంలో ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆమె అక్కడి విశ్వనాథ్ అనే ప్రాంతంలో ఉన్న సద్గురు టీ గార్డెన్‌లోని కార్మికులతో కాసేపు మాట్లాడారు. అనంతరం ఆమె తేయాకు సేకరించారు. తేయాకు కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకే ప్రియాంకా గాంధీ తేయాకు కోశారని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా ఆ పార్టీ పోస్ట్ చేసింది.
Smt. @priyankagandhi learns the intricacies of tea leaf plucking directly from the women tea workers at Sadhuru tea garden, Assam.#AssamWithPriyankaGandhi pic.twitter.com/605Kuah2UL
— Congress (@INCIndia) March 2, 2021
గత 5 ఏళ్లలో బీజేపీ అస్సాంలోని మహిళలకు చేసిందేమీ లేదని ప్రియాంకా గాంధీ ఈ సందర్భంగా ఆరోపించారు. రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇప్పటి వరకు మహిళల కోసం ఏమీ చేయకుండా ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మహిళల ఓట్ల కోసం వారికి స్కూటర్లను పంపిణీ చేస్తున్నారని, ఇది పూర్తిగా ఓట్ల కోసం చేస్తున్న పనేనని ఆమె విమర్శించారు.