ఖలీస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. వివిధ వేషాల్లో పోలీసుల కళ్లుగప్పి తిరుగుతూ వారికి చుక్కలు చూపిస్తున్నాడు. ఈనెల 18వ తేదీన పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకుని పరారైన అమృత్పాల్ కోసం దాదాపు 80వేల మంది పోలీసులు గాలిస్తున్నారు. హరియాణా, పటియాలా, దిల్లీ ప్రాంతాల్లో అతడు సంచరించినట్లుగా గుర్తించారు. ఇటీవల అమృత్పాల్ భారత్ సరిహద్దు దాటి నేపాల్ వెళ్లాడని.. అక్కడి నుంచి అతను విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నాడని పోలీసులు భావించారు.
కానీ అమృత్ పాల్ తిరిగి పంజాబ్ చేరుకున్నట్లు తాజాగా పోలీసు వర్గాల సమాచారం. అమృత్పాల్ ఉన్న ఇన్నోవా కారు మార్నియన్ సమీపంలోని ఫగ్వారా-హుషియర్పూర్ హైవే సమీపంలో గుర్తించినట్లు తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అమృత్ పాల్ ఉన్నట్లు భావిస్తున్న కారును పంజాబ్ పోలీసులు చుట్టుముట్టే ప్రయత్నం చేయగా.. నిందితుడు కారు వదిలి పరిసర గ్రామాల్లోకి పారిపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.