పూరీ జగన్నాథుడి రత్నభాండాగారంలోని మూడో గది ఈ నెల 18వ తేదీ (గురువారం రోజు)న మళ్లీ తెరుచుకోనుంది. 46 ఏళ్ల తర్వాత తొలిసారి, ఈ 14వ తేదీన రహస్య గదిని తెరిచిన విషయం తెలిసిందే. ఆరోజు సాయంత్రం కావడం వల్ల ఏమీ పరిశీలించకుండానే గదికి సీల్ వేసి బయటకు వచ్చేశారు. అయితే రహస్య గదిలో గోడకు ఐదు అల్మారాలు ఉన్నాయని, ఆభరణాలు ఉన్న కొన్ని పెట్టెలు పడి ఉండటాన్ని చూశామని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 18న మళ్లీ ఆ రహస్య గదిని తెరవనున్నారు.
గదిని తెరిచి ఆభరణాలను ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్‌రూంలో భద్రపరుస్తారు. గురువారం ఉదయం 9 గంటల 51 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల మధ్య ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. ఆభరణాలన్నిటినీ తరలించాకే పురావస్తు శాఖ అధికారులను రహస్య గది లోపలికి అనుమతిస్తారని జస్టిస్ బిశ్వనాథ్ తెలిపారు. ఆ తర్వాత ఏఎస్‌ఐ అధికారులు, రహస్య గది నిర్మాణ భద్రతను సమీక్షిస్తారని వెల్లడించారు. ఈ ప్రక్రియలను అంతా వీడియోగ్రాఫ్ చేస్తామని వివరించారు.