దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. అనేక రాష్ట్రాల్లో భారీగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే కోవిడ్‌ను నియంత్రించాలంటే దేశంలో కఠినంగా లాక్‌డౌన్‌ను మరోమారు అమలు చేయాల్సిన అవసరం ఉందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ఈ మేరకు ఆయన ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
గతేడాది లాక్ డౌన్ వల్లే కరోనా కట్టడి సాధ్యమైంది. అప్పటికన్నా ఇప్పుడు కేసుల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. దేశం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కఠినంగా లాక్ డౌన్‌ను అమలు చేయడం ఒక్కటే మార్గం. లేదంటే పరిస్థితులు ఇంకా దిగజారే ప్రమాదం ఉందని గులేరియా అన్నారు. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్ డౌన్లు అమలు చేస్తున్నారు. దాని వల్ల కొంత వరకు ప్రభావం కనిపిస్తోంది. కనుక దేశంలో లాక్‌డౌన్‌ను మరోసారి కొన్ని రోజుల పాటు అమలు చేయాలి. దీంతో కోవిడ్ ఉధృతి కొంత వరకు తగ్గే అవకాశం ఉందని అన్నారు.
కాగా ఒడిశాలో మే 19వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఇక కర్ణాటక, హర్యానా, యూపీ, మహారాష్ట్ర, గోవాలలో లాక్డౌన్లను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో మరోమారు లాక్డౌన్ పెట్టాలనే డిమాండ్ బాగా వినిపిస్తోంది. మరి మోదీ ఏం చేస్తారో చూడాలి.