కేంద్రంలోని మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో మోదీ ప్రధానమంత్రి కావడం కష్టమేనని.. ఇది తన గ్యారంటీ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. న్నికల ప్రచారంలో భాగంగా బిహార్‌లోని పాలిగంజ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
“తనను తాను నిజమైన దేశభక్తుడిగా ప్రకటించుకుంటున్న ప్రధాని మోదీ.. అగ్నిపథ్ పథకంతో జవాన్లను అవమానించారు. దేశం కోసం భగవంతుడు తనను ఇక్కడికి పంపించాడని ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. తానొక నిజమైన దేశభక్తుడిని అంటూ మోదీ ప్రజలను నమ్మిస్తున్నారు. కానీ, అగ్నివీర్ పథకాన్ని అమలుచేసి సైనికులను ఘోరంగా అవమానించారు. ఆయన మళ్లీ ప్రధాని కావడం కష్టమే. ఇది రాహుల్ గ్యారంటీ. రాజ్యాంగ మార్పుకు కాషాయ పార్టీ పన్నుతున్న కుట్రను అడ్డుకుంటాం’’ అని రాహుల్ గాంధీ మోదీపై విరుచుకుపడ్డారు.