– నూతన వ్యవసాయ చట్టాలపై రాహుల్ గాంధీ ఫైర్
– ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్ శ్రేణులు
– ఆ సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్
న్యూఢిల్లీః కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఇటీవల తీసుకువచ్చిన వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి అన్నదాతలకు మద్దతు పెరుగుతుండగా.. ప్రతిపక్ష పార్టీలు సైతం రైతు నిరసనల్లో పాల్గొని ఆ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కాంగ్రెస్ శ్రేణులు రైతు ఆందోళన కార్యక్రమాల్లో పాలుపంచుకునీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాయి.
కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నేతృత్వంలోని కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఇంటిని ముట్టడించాయి. దీనిలో భాగంగా నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు నిర్వహిస్తూ.. ధర్నాకు దిగాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు మేలుచేయవని.. అన్నదాతలను నాశనం చేస్తాయని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కారు ఆ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకూ కాంగ్రెస్ పోరు సాగిస్తుందని స్పష్టం చేశారు. రైతులను నాశనం చేయడానికి ఈ చట్టాలను తీసుకువచ్చారు. ఇప్పుడు వీటిని అడ్డుకోకపోతే.. ఇతర రంగాలకు కూడా మరిన్ని ప్రజా వ్యతిరేక చట్టాలను మోడీ సర్కారు తీసుకురావచ్చు అని రాహుల్ పేర్కొన్నారు. మోడీ సర్కారు రైతు హక్కులను కాలరాస్తున్నదని ఆరోపించారు.
అలాగే, రైతులపై జరుగుతున్న దాడులు, దేశంలోని ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న నిత్వవసరాల ధరలపై యావత్ దేశ ప్రజానీకం గొంతెత్తుతున్నదని ట్వీట్ చేశారు. అలాగే, రైతులకు అండగా ప్రతిఒక్కరూ ముందుకు రావాలని కోరారు. కాగా, రైతు హక్కులకు మద్ధతుగా కాంగ్రెస్ పార్టీ రైతు హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా అన్ని రాష్ట్రాల గవర్నర్ల అధికార నివాసాల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్ అధినాయకత్వం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
కాగా, కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు ఢిల్లీ సరిహద్దులో 50 రోజులకు పైగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. పంజాబ్, హర్యానా,ఉత్తర ప్రదేశ్,రాజస్థాన్ సహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈనెల 26న భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడానికి రైతులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కేంద్రం, రైతుల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ సఫలం కాలేదు. నేడు (శుక్రవారం) కూడా రైతులు, ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతున్నాయి.