అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ వరదల్లో ఇప్పటి వరకు 78 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వరద బాధిత ప్రాంతాల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం పర్యటించారు. కచార్ జిల్లాలో సిల్చార్‌ను సందర్శించారు. బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. వరద బాధితులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
పునరావాస కేంద్రాలను సందర్శించిన రాహుల్ వరద బాధితులతో మాట్లాడారు. అనంతరం హింసతో అట్టుడుకుతున్న మణిపుర్‌కు ఆయన ప్రయాణమయ్యారు. అక్కడ జిబామ్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఆ తర్వాత చురాచాంద్‌పుర్, మోయిరాంగ్‌లో శిబిరాలను సందర్శించి బాధితులను పరామర్శిస్తారు.. సాయంత్రం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలసిన అనంతరం విలేకర్ల సమావేశం నిర్వహిస్తారు.
అస్సాంలో వరదలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా ఇప్పటివరకు 78 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బ్రహ్మపుత్ర, బరాక్‌లతో కలిపి మొత్తం ఆరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కామ్‌రూప్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.