ఒడిశాలో ఆగి ఉన్న ట్రక్కును వ్యాన్ను ఢీ కొట్టిన ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గుడికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..
ఒడిశాలో కెంధూఝర్లో ఆగి ఉన్న ట్రక్కును ఓ వ్యాన్ ఢీ కొట్టింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు ఘటగావ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గంజాంలోని దిగపహండి నుంచి కెంధూఝర్ జిల్లాలోని ఘటగావ్లోని తారిణి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. వ్యాన్లో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. మృతులందరూ గంజాం జిల్లాలోని పొడమరి గ్రామానికి చెందిన వారని వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.