రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్‌ను గద్దె దించాలనే లక్ష్యంతో ఏర్పడిన ఇండియా కూటమి ఆ దిశగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. త్వరలోనే సభలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే ఆ కూటమిలో కీలక నేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. అది కూడా శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే నుంచి.
విదేశీ పర్యటనకు బయలుదేరిన మమత దుబాయిలో ఆగారు. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం లాంజ్‌లో మమతను చూసి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే పలకరించి.. ఆమెతో కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష కూటమి (ఇండియా)కు మీరు నాయకత్వం వహిస్తారా..? అని అడిగారు. అందుకు దీదీ నవ్వుతూ.. ప్రజల సహకారం ఉంటే రేపు మనం అధికారంలో ఉండగలం అని అన్నారు. కోల్‌కతా వేదికగా నవంబరులో నిర్వహించే వాణిజ్య సదస్సుకు సింఘేను ఆహ్వానించినట్లు మమత తెలిపారు. తమ దేశాన్ని సందర్శించాల్సిందిగా సింఘే తనను ఆహ్వానించారని ట్విటర్ వేదికగా వెల్లడించారు.