కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్-370ని రద్దు వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆర్టికల్-370ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాలపై ఆగస్టు 2 నుంచి పూర్తి స్థాయి విచారణ జరపనున్నట్లు వెల్లడించింది. ఇది వరకు పిటిషనర్లుగా ఉన్న ఐఏఎస్ అధికారి షా ఫైజల్, హక్కుల కార్యకర్త షేహ్లా రషీద్‌లు.. ఈ వ్యవహారం నుంచి తప్పుకున్నారు.
ఈ నేపథ్యంలో కేసును ఇకపై ‘ఆర్టికల్ 370 ఆఫ్ కాన్స్టిట్యూషన్’గా పిలవనున్నట్లు తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన వాదప్రతివాదులందరూ జులై 27లోపు తమ లఖితపూర్వక పత్రాలు సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది.
ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించిన పిటిషనర్లలో నుంచి తమ పేర్లను తొలగించాలన్న షా ఫైజల్, షేహ్లా రషీద్‌ల అభ్యర్థనకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఇదివరకు ఈ కేసులో లీడ్ పిటిషనర్‌గా షా ఫైజల్ ఉండేవారు. అప్పుడు కేసు పేరును ‘షా ఫైజల్ అండ్ అదర్స్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం’గా పిలిచేవారు.