కాస్త టైం ఇవ్వాల్సింది.. ట్విటర్​లో ఉద్యోగాల కోతపై కేంద్రం రియాక్షన్

-

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్​ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ కంపెనీలో పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. ముందుగా కంపెనీ బాస్​లను తొలగించారు. ఆ తర్వాత దాదాపు సగం మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశారు. ట్విటర్‌లో భారీ స్థాయిలో ఉద్యోగుల కోతపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

ఎలాన్‌ మస్క్‌ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఖండించారు. దీని వల్ల ప్రభావితమయ్యే ఉద్యోగులకు కొంత సమయం ఇచ్చి ఉండాల్సిందని అన్నారు. ‘‘భారత్‌లో ట్విటర్‌ తమ ఉద్యోగుల్ని తొలగించిన తీరుని మేం ఖండిస్తున్నాం. మరో ఉద్యోగంలోకి మారేందుకు వారికి తగినంత సమయం ఇచ్చి ఉండాల్సింది’’ అని వైష్ణవ్‌ తెలిపారు.

ట్విటర్‌ను సొంతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. ఖర్చుల్ని తగ్గించుకోవడం, కంపెనీ నష్టాల్ని అదుపు చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తొలగింపులో భాగంగా భారత్‌లోని సంస్థ ఉద్యోగులకు సైతం ఉద్వాసన పలికారు. భారత్‌లో 230 మంది ట్విటర్‌లో పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 180 మందిని ఇంటికి పంపినట్లు సమాచారం. కొన్ని విభాగాల్లోనైతే సిబ్బందిని పూర్తిగా తీసివేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఇంటికి పంపిన వారిలో కొంత మంది ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు రమ్మన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version