ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో భోలే బాబా సత్సంగ్లో జరిగిన తొక్కిసలాటలో 116 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అనేక మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒక బాబా నిర్వహించిన కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు రావడం, ఇలాంటి విషాద ఘటన జరగడంతో యావత్ భారతావని ఉలిక్కిపడింది. అసలు ఈ సత్సంగ్ ఏంటి? ఈ బోలే బాబా ఎవరు? ఎందుకు అంతమంది ఆయణ్ను దర్శించుకుంటున్నారు?
భోలే బాబా అసలు పేరు నారాయణ్ సాకార్ హరి యూపీలోని ఎటా జిల్లా పటియాలి తహసీల్‌లోని బహదూర్ గ్రామానికి చెందిన వాడు. ఆయన బాబా సాకార్ విశ్వ హరి లేదా ‘భోలే బాబా’గా ప్రసిద్ధి. గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసినట్లు ఈ భోలే బాబా చెప్పుకునేవాడట. 26 ఏళ్ల క్రితమే ఉద్యోగం నుంచి వైదొలిగి, ఆధ్యాత్మిక బాట పట్టినట్లు ప్రచారం చేసుకున్న ఈ బాబా.. తనకు గురువు ఎవరూ లేరని, కేవలం సమాజహిత కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతుంటాడు.
అలా ఆ నోటా ఈ నోటా ఈ బాబా గురించి తెలిసి.. కొంత కాలంలోనే వేల సంఖ్యలో భక్తులు భోలే బాబాను అనుసరించడం మొదలు పెట్టారు. అలీగఢ్‌తోపాటు హాథ్రస్ జిల్లాల్లో ప్రతి మంగళవారం ‘సత్సంగ్’ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. ఇందుకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. అలా ఈనెల 2వ తారీఖున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ విషాదం చోటుచేసుకుంది.