మణిపూర్ ఎందుకు రగులుతోంది.. ఈ కార్చిచ్చుకు కారణం ఏంటి??

-

పచ్చని చెట్లు , చూడచక్కని కొండలతో ప్రకృతి రమణీయత అద్దుకున్న మణిపూర్ రాష్ట్రం ఇప్పుడు తగలబడుతోంది. గత మే నెల నుంచి కాల్పులు, హత్యలు, దౌర్జన్యాలుతో నెత్తుటి ధారలు పారుతున్నాయి. రానురాను హింసాత్మక పరిస్థితులు ఏర్పడటంతో ప్రభుత్వం కొన్ని రోజులుగా ఇంటర్నెట్ సేవలను బంద్ చేసింది. దీంతో అక్కడ ఘోరాలు జరుగుతున్నప్పటికీ బయట ప్రపంచానికి అవి తెలియడం లేదు. ఇద్దరు కుకీ మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించడం, వారిపై దాడి చేయడం అక్కడ జరుగుతున్న దారుణాలకు అద్దం పడుతున్నాయి. ప్రశాంతంగా ఉండే మణిపూర్ అసలు ఎందుకు ఇంతగా రగులుతోంది. కాష్టంలా తగలబడటానికి అసలు కారణమేంటి…?

మణిపూర్ రాష్ట్రంలో తెగల మధ్య వచ్చిన ఆధిపత్య పోరు ఈ దారుణాలకు కారణమని తెలుస్తోంది. ఇక్కడ మెయితీ తెగకు చెందిన జనాభా 53% ఉంటుంది. వీళ్ళు షెడ్యూల్ తెగల హోదా కల్పించాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తోంది.ఈ డిమాండ్ ని స్థానిక గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో 53% ఉన్న వీరు కేవలం 10 శాతం భూమిలో మాత్రమే ఉంటున్నారు. అయితే రాష్ట్ర శాసనసభలో మొయితీలు మూడింట రెండు వంతుల మంది ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 40 శాతం మంది ఉన్న గిరిజనులు 90 శాతం భూమిని అనుభవిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా, మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున చట్ట విరుద్ధంగా వచ్చినవారు ఎస్టీ హోదా కోరుతున్నట్లు మెయితీలు ఆరోపిస్తున్నారు. మొయితీలు కోరినట్లు ఎస్టి హోదా కల్పిస్తే భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను, ఉద్యోగ అవకాశాలను కోల్పోతామని కుకీలు ఆందోళన చెందుతున్నారు. అందుకే మొయితీలను ఎస్టీలుగా పరిగణించడాన్ని కుకీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలోని భూమిలో అత్యధిక భాగం కొండ ప్రాంతాల్లోనే ఉంది. ఇక్కడ గిరిజనులు ఉంటున్నారు. ఇక్కడ నాగాలు, కుకీలు ఉన్నారు.. వీళ్లంతా ప్రధానంగా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారు.

మణిపూర్ రాష్ట్రంలోని చట్టాలు ఇక్కడి భూమిని బయటి ప్రాంతాల వారు ఆక్రమించుకోకుండా రక్షిస్తుంటాయి. 371సీ అధికరణ ప్రకారం కొండ ప్రాంతాలకు పరిపాలనపరమైన స్వయం ప్రతిపత్తి ఉందని చెబుతున్నారు.రిజర్వ్ ఫారెస్ట్ ను ఆక్రమించుకున్న వారిని మాత్రమే ఖాళీ చేయిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. రిజర్వ్ ఫారెస్ట్ ను గంజాయి తోటల పెంపకం, మాదకద్రవ్యాల వ్యాపారం కోసమే వాడుకుంటున్నారని, అలాంటి వారిని ఖాళీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.ఇక్కడ బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది.బీజేపీ ప్రభుత్వం మెయితీల పక్షాన ఉంటోంది. కుకీలు, నాగాల విషయంలో పక్షపాతంతో వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది మార్చిలో ఇక్కడ అధికారంలోకి బీరేన్ సింగ్ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలే ఈ వివాదానికి ఆజ్యం పోసాయి అనే చెప్పాలి. వారి ఆధీనంలో ఉన్న అటవీ భూములను ఫారెస్ట్ గా మార్చేందుకు ప్రయత్నించడం, వారి గ్రామాలను అక్రమమైనవిగా ప్రకటించడం, రాష్ట్రంలో ఎన్ ఆర్ సి అమలు చేయాలని అనుకోవడం….వంటి అంశాలు ఆదివాసుల్లో ఆగ్రహాన్ని రగిల్చాయి. కుకీ ప్రాంతంలో అడుగు పెట్టడానికి ఏ మెయితీ కూడా ధైర్యం చేయడం లేదు. మరోవైపు మెయితీ ప్రజలు ఉండే ప్రాంతానికి వెళ్లే సాహసం ఏ కుకీ చేయడం లేదు.

ఈ అంశంపైనే ఇటీవల నిర్వహించిన పార్లమెంట్ సమావేశాలు దద్దరిల్లాయి. మాణిపూర్ అల్లర్లను చల్లార్చి అక్కడ శాంతిని స్థాపించాలని కొందరు కోరగా ప్రతిపక్షాలు ఏకంగా ఇందులో బీజేపీ కుట్ర ఉందని ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మణిపుర్ గవర్నర్ అనుసూయా ఉయికే అధ్యక్షతన 51 మందితో ఏర్పాటు చేసిన శాంతి కమిటీపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి.కుకీ తెగకు చెందిన అత్యున్నత సంస్థ ‘కుకీ ఇంపి’ శాంతి కమిటీ ఏర్పాటును తిరస్కరించింది. అదే సమయంలో మెయితెయ్ సంఘానికి నాయకత్వం వహిస్తున్న మణిపుర్ సమగ్రత సమన్వయ కమిటీ కూడా ఈ శాంతి కమిటీలో చేరబోమని ప్రకటించింది. రాష్ట్రాన్ని సరిగ్గా అర్థం చేసుకునే వ్యక్తులు కమిటీలో లేరని ఇక్కడి తెగలు ఆరోపిస్తున్నాయి.

మొన్నామధ్య హోమ్ మంత్రి అమిత్ షా పర్యటన వలన ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదని అంటున్నారు.కాగా రెండురోజుల క్రితం మాణిపూర్ వెళ్లిన ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు కూడా అక్కడి పస్థితులను పరిశీలించి కేంద్రాన్ని దుయ్యబట్టారు.ఈ వివాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు కూడా జరుగుతున్నాయి. మణిపూర్ లో శాంతిని స్థాపించాలంటూ ఉభయ కమ్యూనిస్టులు ఆందోళనలు చేస్తున్నారు.ఈ ఆగ్రహాన్ని చల్లార్చడానికి అటు బీజేపీ కూడా మల్లగుల్లాలు పడుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version