అనంతలో వైసీపీ,టీడీపీ మధ్య కొత్త పోరు

-

అనంతపురం జిల్లా రాజకీయం కాస్త చల్లబడింది అనేలోగా మరో అంశం వేడి పుట్టిస్తుంది. జిల్లాలో కాస్త వివాదాలకు దూరంగా ఉండే నియోజకవర్గాలైన రాయదుర్గం, కళ్యాణదుర్గాలలో కొత్త వివాదం రాజుకుంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్‌కు చేరుకుంటోంది. ఎమ్మెల్యేలే టార్గెట్ గా టీడీపీ విమర్షలు చేస్తుంటే అదే స్పీడులో సై అంటున్నారు వైసీపీ నేతలు.

అనంతలో నేతల మధ్య విమర్శలు.. ఆరోపణలు చూస్తుంటే ఒక్కోసారి చాలా తీవ్రంగా ఉంటాయి. వీరి స్పీడు చూసిన వారు సైతం ఏదో జరుగుతుందన్న డిఫెన్స్ లో పడతారు కానీ సీన్ కట్ చేస్తే అవి ఉత్తి ఆరోపణలు.. ఉత్తుత్తి ఖండనలు. రాయదుర్గం,కళ్యాణదుర్గం ప్రాంతాలకు చెందిన నేతలు ఆరోపణలు,ఇసుక దుమారంపై చేలరేగుతున్న మాటల మంటలపై ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనాలు.

రాయదుర్గంలో ఇసుక నిల్వలు ఎక్కువ. ఇక్కడి నుంచి బెంగళూరుకు అక్రమంగా ఇసుక తరలిస్తారన్నది బహిరంగ రహస్యం. అక్రమంగా ఇసుక తరలిస్తూ వాహనాలు పోలీసులకు దొరికితే అవి వైసీపీవారికి చెందినవే అన్నది టీడీపీ ఆరోపణ. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులే మీడియా ముందుకు వచ్చి సవాళ్లు విసురుతుంటారు. కల్యాణదుర్గంలోనూ ఇదే తరహా ఇసుక రాజకీయం నడుస్తోంది. వైసీపీ నేతలు బరి తెగించి ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. వైసీపీ నేతలు సైతం మాకు సంబంధం లేదంటూ సవాళ్లకు సిద్దమవుతారు…

రాయదుర్గం ఎమ్మెల్యేగా కాపు రామచంద్రారెడ్డి, కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ ఉన్నారు. వీరిద్దరి లక్ష్యంగానే టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్‌. ఈ మాటల యుద్ధంలో వెనకపడితే పొలిటికల్‌గా డ్యామేజీ అవుతుందని భావిస్తున్నారో ఏమో.. నాయకులు ఏ మాత్రం తగ్గడం లేదు. సవాళ్లు విసురుకుంటూ ఏదో అయిపోతుందన్నట్టుగా హడావిడి చేస్తున్నారట.

ఆరోపణలకు ఆధారాలు చూపించాలన్నది రెండు పార్టీల నేతలు చెప్పే మాట. ఆధారాలు చూపించడానికి ఆరోపణలు చేసినవారు ముందుకు రారు. ఇది తెలిసి దమ్ముంటే నిరూపించాలని కోరతారు అధికార పార్టీ నాయకులు. అంతకుమించి ఈ దుమారం ఒక్క అంగుళం కూడా ముందుకు కదలదు. కాకపోతే శ్రుతిమించి వాగ్బాణాలు సంధించుకోవడంలో ఆరితేరిపోయారు ఈ రెండు నియోజకవర్గాలకు చెందిన నాయకులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version