తెలంగాణలో కొత్త ప్రతిపక్షం… ఆందోళనలో కేసీఆర్?

-

ఆరంభసూరత్వం అనుకోవాలో లేక వైరస్ కు అంత సీన్ లేదనుకుంటున్నారనుకోవాలో అదీగాక చాలా మంది జనాల్లానే ప్రభుత్వం కూడా లైట్ తీసుకుందనుకోవాలో తెలియదు కానీ… కరోనా వచ్చినకొత్తల్లో ఎంతో సీరియస్ గా చర్యలు తీసుకుంటున్నట్లు అనిపించిన తెలంగాణ సర్కార్ పనితీరు.. ఉండగా ఉండగా మెత్తబడిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. టెస్టుల సంఖ్య పెరగడం లేదు.. ఆ విషయంలో దేశంలోనే వెనకబడిపోయారనే విమర్శలు.. మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయడం లేదని కోర్టుల మొట్టికాయలు.. టెస్టుల సంఖ్యలు పెంచడం లేదు అని జనాల గగ్గోలు.. గాంధీలో వైద్యుల నిరసనలు! ప్రతిపక్షాలు నిరసన చేస్తే పోలీసులు ఉన్నారు… కరోనానే నిరసన చేయిస్తుంటే ఎవరున్నారు… టెస్టులు పెంచడం… సడలింపులు తగ్గించడం తప్ప!

ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ కింగ్!! ఆయనకున్న రాజకీయ బలం వల్ల ప్రతిపక్షాలు కూడా మిన్నకుంటున్న పరిస్థితి! వారికి ఎప్పుడైనా కాస్త ఊపొచ్చి, కాంగ్రెస్ నాయకులు పీసీసీ పీఠం గొడవల సంగతి కాసేపు పక్కనపెట్టి, హడావిడి చేద్దామన్నా… ఫలితాలు అంతంతమాత్రం! కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అయినా సమస్యలపై కాస్త గట్టిగా మాట్లాడుతుందా అంటే… అది కూడా నాం కే వాస్తే! వారు నిజంగానే మిన్నకుంటున్నారా లేక వారి రియాక్షన్ ప్రజల్లోకి వెళ్లడం లేదా, ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటే… అది తెలంగాణా మీడియానే చెప్పాలి!

తెలంగాణలో ఆదివారం ఒక్కరోజులోనే అత్యంత భారీ సంఖ్యలో కరోనా కేసులను గుర్తించారు. మొత్తం 237 కరోనా కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌ లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4974కు చేరుకుంది. కరోనా మృతుల సంఖ్య 185కి చేరుకుంది. ఇదే క్రమంలో హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న 23 మంది జర్నలిస్టులకు కరోనా సోకింది! టీవీ5 జర్నలిస్ట్ మనోజ్ కరోనా వైరస్ బారిన పడి చనిపోయాడు! ఆ తర్వాత హైదరాబాద్‌ లో పనిచేస్తున్న 140 మంది జర్నలిస్టులకు ప్రభుత్వం కరోనా వైరస్ టెస్టులు నిర్వహించింది. వారిలో 23 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది.

అయినా కూడా పక్కనున్న ఏపీ ఆ స్థాయిలో టెస్టులు చేస్తూ.. ఎక్కడికక్కడ అరికట్టే ప్రయత్నం చేస్తుంటే… తెలంగాణ సర్కార్… ఆ విషయంలో సుప్రీం కోర్టుకు అయినా వెళ్తామన్నట్లుగా ఉంటుంది తప్ప… యుద్దప్రాతిపధికన చర్యలు ఎందుకు తీసుకోవడంలేదో సామాన్యుడికి అర్ధం కాని పరిస్థితి! గత 5 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 1054 కరోనా కేసులు నమోదు కాగా, వాటిలో అత్యధికంగా 825 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి అంటే… కరోనా తీవ్రత తెలంగాణకు గుండెకాయ లాంటి విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరంలో ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు!

స్వీయనియంత్రణే శ్రీరామ రక్ష అన్న విషయం ప్రజలు మరిచిపోతున్నారా.. లేక సడలింపుల పేరుతో ప్రభుత్వాలే కరోనా వ్యాప్తికి పరోక్ష కారణాలవుతున్నాయ అన్నది పెద్ద ప్రశ్నే! ఈ క్రమంలో కేసీఆర్ ను భయపెట్టగలిగి పనిచేయించుకునే శక్తి సంపాదించుకున్నట్లుంది కరోనా! ప్రతిపక్షాలు ఎవరు చెప్పినా కేసీఆర్ వినరు అనే పేరుసంపాదించుకున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో… టెస్టుల అధికంగా చేయించుకోమని కరోనా విజృంభించి చెబితే మాత్రం వింటున్నట్లున్నారు. దీంతో ఆందోళన చెందిన కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు!

పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో పరీక్షలు ఎక్కువగా నిర్వహించాలని ఆదేశించారు. వచ్చే పది రోజుల్లో 30 నియోజకవర్గాల పరిధిలో 50వేల మందికి పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ప్రైవేటు ల్యాబరేటరీలు, ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ నిబంధలను అనుసరించి వ్యాధి నిర్ధారక పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలు, ధరలు నిర్ణయించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version