మారుమూల ఉన్న శ్రీకాకుళం జిల్లా అలికాం నుంచి కొత్తూరుకు మూడు కోట్ల రూపాయలకు పైగా నిధులతో వంతెనతో పాటు రోడ్డు వస్తుందంటే అందుకు కారణం కేంద్రం ఇచ్చిన నిధులే ! ఆ విధంగా రాష్ట్రానికి మోడీ కొంత సాయం నాబార్డు పేరిట చేశారు. కానీ వైసీపీ శ్రేణులు వీటిని ఫోకస్ చేయడం లేదు అని, కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకూ వైసీపీ తన డప్పు కొట్టుకుంటోందని బీజేపీ ఆవేదన చెందుతోంది. ఏదయితేనేం ఇప్పటివరకూ అపరిష్కృతంగా ఉన్న రోడ్ల సమస్యలపై కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా దృష్టి పెడితే కొన్ని వంతెనల నిర్మాణం పూర్తయితే రానున్న వర్షాకాలంలో ప్రయాణికులకు గండాలు గండెక్కినట్లే !
ఆంధ్రావనిలో రహదారుల పరిస్థితి కాస్తో కూస్తో చక్కదిద్దేందుకు చర్యలు మొదలు అయ్యాయి. ఈ నేపథ్యంలో నాబార్డు సాయంతో కొన్ని చోట్ల పనులు కూడా ప్రారంభం అయ్యాయి. రెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో పనులు జరుగుతున్నాయి. నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీం (నిడా) కింద రెండో దశలో వివిధ వంతెనలకు మోక్షం దక్కించేందుకు సాయం అందిస్తోంది. మరి! వీటిపై జగన్ సర్కారు మాట్లాడుతుందా లేదా ఇవి కూడా తమ ఘనతే అని డప్పు కొట్టుకుంటుందా? అన్నది బీజేపీ అనుమానం. శ్రీకాకుళం జిల్లా మొదలుకుని కర్నూలు వరకూ వివిధ స్థాయిలో వివిధ దశలల్లో చిన్న, మధ్య తరహా వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరవ్వడం విశేషం. కొన్ని పనులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోడ్లు,భవనాల శాఖ కూడా కొంత నిధులు వెచ్చించనుంది. ఈ మేరకు 87.22కోట్లతో 16 వంతెనల నిర్మాణానికి ముందుకు వచ్చింది. ఇవన్నీ పూర్తయితే కాస్తో కూస్తో ప్రయాణ యోగ్యత అన్నది మెరుగుపడనుంది.
వాస్తవానికి ఎప్పటి నుంచో రోడ్ల మరమ్మతులు అన్నవి లేవు. అదేవిధంగా వర్షాలకు కొట్టుకుపోయిన వంతెనలూ మోక్షానికి నోచుకోని విధంగానే ఉన్నాయి. ఇదే సమయంలో చిరకాలం పనులకు నోచుకోక ఉన్న రహదారులు నిధుల్లేక అస్తవ్యస్తంగా ఉన్నాయి. మారాయి. ఈ సమయంలో ప్రభుత్వం కాస్త నిధులు విదిల్చి పనులు చేపట్టడం బాగుంది.అయితే ఈ పనులకు కేంద్రం సాయం ఎక్కువగా ఉంది. కానీ నిడా పర్యవేక్షణలో జరుగుతున్న పనులకు రాష్ట్రం పెద్దగా ప్రచారం ఇవ్వదు. కానీ వాస్తవం మాత్రం ఇదే ! ఇదే విధంగా గ్రామీణ రహదారులకు కూడా మోక్షం దక్కిస్తే మేలు అన్న భావన కూడా వస్తోంది.