ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కూల్చివేతల పర్వం నడుస్తోంది. కరకట్ట..ప్రజావేదిక..చంద్రబాబు నివాసం..ఇప్పుడు టీడీపీ కార్యాలయం. ఏపీ ప్రభుత్వం అక్రమ కట్టడాలను ఎక్కడ ఉన్నా ఉపేక్షించవద్దని స్పష్టమైన అదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా టీడీపీ కార్యాలయానికి నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ వాగు పోరంబోకు భూమి, ప్రైవేటు రైతుల భూములను ఆక్రమించి మండలంలోని ఆత్మకూరు గ్రామం జాతీయ రహదారి వెంట టీడీపీ కార్యాలయ భవనం నిర్మించారని అంటున్నారు.
అయితే ఈ విషయాలను వెలుగులోకి రావడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. ప్రభుత్వ వాగు పోరంబోకు భూమిని పరిశీలించారు. ఆక్రమించి నిర్మాణం చేపట్టారని నిర్ధారించారు. గత శుక్రవారం నిర్మాణదారులకు ప్రభుత్వ భూములలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేశారు. మంగళగిరి తహసీల్దార్ రామ్‌ప్రసాద్ నోటీసులు జారీ చేసిన ఏడు రోజులలోపు ప్రభుత్వ భూమిలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని, లేనిపక్షంలో తామే తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.