ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అందరి చేతుల్లోనూ కనిపిస్తోంది. ఆ టెక్నాలజీ సైతం ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతోంది. ప్రస్తుతం 4జీ ఫోన్లు అంతా వాడుతున్నారు. కానీ ఇప్పటికే కొన్ని దేశాల్లో 5జీ సేవలు అందుతున్నాయి. మరి మన ఇండియాకు 5జీ ఎప్పుడు వస్తుంది. ఇందుకు అడ్డంకులేంటి.. ఓసారి చూద్దాం..
కేంద్ర ప్రభుత్వం 5జి సాంకేతికతను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది. 2020 నాటికి 5జి సాంకేతికతను దేశంలో ప్రవేశపెట్టే దిశగా కసరత్తు చేస్తోంది. కేంద్ర సమాచారశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జూన్ 3న కీలకప్రకటన చేశారు. త్వరలోనే స్పెక్ట్రం వేలం వేయనున్నామని, అందులో 5జి సెల్యూలర్ టెక్నాలజీతో పని చేసే తరంగాలు కూడా ఉన్నాయని తెలిపారు.
అక్టోబర్ నాటికి 5జి ట్రయల్స్ చేపడతామని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. ప్రస్తుతం ఆ పనులు సాగుతున్నాయి. అమెరికా, చైనా సహా కొన్ని దేశాల్లో ఇప్పటికే 5జి నెట్ వర్క్ అందుబాటులో ఉంది. దక్షిణ కొరియా, అమెరికా ఇప్పటికే 5జి వాణిజ్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ మనదేశం మాత్రం ఇంకా పరీక్షల స్థాయిని కూడా పూర్తి చేయలేదు. వచ్చే ఫిబ్రవరి నాటికి 5జీ అందుబాటులోకి రావచ్చని ఓ అంచనా.
5జీ అందుబాటులోకి వస్తే.. మెషిన్ నుంచి మెషీన్‌కు సమాచారం ఇవ్వడం, భారీ స్థాయిలో అప్లికేషన్లను ఒకేసారి నిర్వహించడం లాంటి పెద్ద అవసరాలకు 5జి వెన్నముకలా నిలుస్తుంది. డ్రైవర్ రహిత వాహనాలను నడిపించడం, టెలిఫోన్ సేవల ఆధారంగా శస్త్రచికిత్సలు నిర్వహించడం, రియల్ టైం డాటా విశ్లేషణలో 5జి టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతుంది. ఒక చోటి నుంచి మరో చోటికి సమాచార మార్పిడిలో ఎలాంటి అంతరాయం ఉండకపోగా.. అత్యంత వేగంగా, తక్కువ సమయంలో సమాచార మార్పిడి జరుగుతుంది. అలాంటి 5జీ త్వరలోనే ఇండియాలో అందుబాటులోకి రావాలని ఆశిద్దాం.