ఈ వ్యాపారినికి పెట్టుబడి నిల్‌.. లాభం ఫుల్‌..!!

-

సాధారణంగా ఏ వ్యాపారం చేయాలన్నా.. మన దగ్గర ఎంతో కొంత డబ్బు ఉండాలి.. పెట్టుబడి లేకుండా ఏ బిజినెస్‌ పెట్టలేం.. కానీ కొన్ని వ్యాపారాలకు డబ్బే పెట్టుబడి కాదు.. మీ బుద్దిబలం, కండబలం కూడా సరిపోతుంది. డిగ్రీ, బీటెక్‌ చదివేసి ఖాళీగా ఉన్న యువత దగ్గర పెద్దగా డబ్బులు ఉండవు. ఇంట్లో వాళ్లు ఏ జాబ్‌ లేదని నసపెడుతూ ఉంటారు. ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌ ఉండి ఏదైనా బిజినెస్‌ చేద్దాం అనుకునే వారికి ఇది బెస్ట్‌ ఐడియా..! దీనికి పెట్టుబడి కూడా లేదు.. కానీ లాభం మాత్రం దండిగానే ఉంటుంది..

ఇప్పుడు వెడ్డింగ్ ప్లానర్స్ సంస్కృతి వచ్చింది. అలంకరణ, వేధిక, భోజనాలు ఇలా అన్నింటినీ వారే చూసుకుంటున్నారు. ఇందుకు సరిపడా డబ్బులను ముందే మాట్లాడుకుని తీసుకుంటారు వెడ్డింగ్ ప్లానర్స్. వెడ్డింగ్ ప్లానర్లలో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వారు ఆహారం, వెయిటర్లు, టెంట్లు మొదలైన ప్రాథమిక వివాహ సౌకర్యాలను కూడా అందిస్తారు. మరి కొంతమంది వెడ్డింగ్ ప్లానర్లు మొత్తం పెళ్లిని ప్లాన్ చేస్తారు. పెళ్లికి సంబంధించిన ప్రతి చిన్న పని వారే దగ్గరుండి చూసుకుంటారు.

వెడ్డింగ్ ప్లానర్ అనేది కెరీర్ ఆప్షన్‌గా కూడా మారింది. మీరు ఈ వ్యాపారం చేయాలనుకుంటే మీరు వెడ్డింగ్ ప్లానింగ్‌కు సంబంధించి ఏదైనా కోర్సు లేదా డిప్లొమా చేయాలి. చాలా ఇన్‌స్టిట్యూట్‌లు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్నాయి. వెడ్డింగ్ ప్లానర్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ కోర్సు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు చదివే ఓపిక మాకు ఎక్కడ ఉంది అంటారా..? మీరు వెడ్డింగ్ ప్లానర్ కంపెనీలో ఉద్యోగం చేసిన అనుభవం ఉన్న వారిని కలిసినా బేసిక్‌ డీటెయిల్స్‌ తెలుస్తాయి..

వెడ్డింగ్ ప్లానర్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, మీకు తప్పనిసరిగా కార్యాలయం ఉండాలి. ప్రారంభంలో, మీరు ఇంటి వద్ద కూడా కార్యాలయాన్ని తయారు చేసుకోవచ్చు. దీని తర్వాత, మీరు భోజనాలు(క్యాటరింగ్), టెంట్ హౌస్‌లు, వివాహ అలంకరణ, బ్యాండ్‌లు, DJ సౌండ్‌ను అందించే వ్యక్తులతో మాట్లాడుకుని అగ్రిమెంట్ చేసుకోవాలి. మీరు ఈ వ్యక్తులను మీ ఉద్యోగంలో ఉంచకుండా కమీషన్ ప్రాతిపదికన నియమించుకోవచ్చు.

ఈ వ్యాపారానికి క్లయింటే పెట్టుబడి.. మీరు ఒక క్లయింట్‌ను వెతుక్కోని వారి దగ్గర నమ్మకం సంపాదించారంటే.. పెట్టుబడి వాళ్లే ఇస్తారు. మొదట్లో రెండు మూడు పెళ్లిళ్లకు బాగా కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడు మీ దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంటుంది కాబట్టి.. పనివాళ్లకు ఇంకా ఖర్చులకు పెద్దగా చింత ఉండదు. మీ వ్యాపారం బాగా సాగిన తర్వాత.. భోజనాలు (క్యాటరింగ్), డెకరేటర్లు తయారు చేసే వ్యక్తులను జీతంపై మీతో ఉంచుకోవచ్చు. మీరు DJ సౌండ్ సిస్టమ్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. కానీ, వీటిలో ఖర్చులు ఎక్కువ కాబట్టి వీటన్నింటిని వ్యాపారం బాగా సాగిన తర్వాతనే ఏర్పాటు చేసుకోవాలి.

పెట్టుబడి ఎంత?

ఈ పని చేయడానికి అనుభవం అవసరం. క్లయింట్‌లను రప్పించుకుని పెళ్లిళ్లను చక్కగా నిర్వహించగలమని మీరు భావిస్తే, మీరు పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రారంభంలో 0-లక్ష రూపాయలు ఉంటే మీరు ఈ పనిని ప్రారంభించవచ్చు. ఈవెంట్ ఆర్డర్ ద్వారా మీరు తీసుకున్న అడ్వాన్స్‌నే పెట్టుబడిగా కూడా మార్చుకుని వ్యాపారం ప్రారంభించుకోవచ్చు.

ఎంత సంపాదించవచ్చు?

సంవత్సరానికి 2-3 సార్లు వివాహ సీజన్ వస్తుంది. మీకు మంచి పరిచయాలు ఉంటే, నాణ్యమైన సేవను అందించడం ద్వారా ప్రారంభంలో సంవత్సరంలో ఐదు-ఆరు మంచి వివాహాలు చేసినా ఒక వివాహానికి 1 లక్ష రూపాయలు సులభంగా సంపాదించవచ్చు. అంటే నెలకు 50 వేలు పొందొచ్చన్నమాట. పెళ్లిళ్లే కాకుండా ఈ రోజుల్లో బర్త్‌డే పార్టీ, ఫేర్‌వెల్ పార్టీ లాంటి ఈవెంట్‌ల నిర్వహణ కూడా ప్రొఫెషనల్ వ్యక్తులకే ఇస్తున్నారు. ఈ వ్యాపారం వల్ల ఎటు చూసినా నష్టం అయితే ఉండదు.. కాకపోతే ఒక్కరి వల్ల కాదు.. పెద్ద కుటుంబం అయినా ఉండాలి, స్నేహితులైనా ఉండాలి లేదా..పనివాళ్లు అయినా నియమించుకోవాలి. కలిసికట్టుగా చేస్తేనే సక్సస్‌ అవగలం.!

Read more RELATED
Recommended to you

Exit mobile version