రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించినప్పుడు… ఆయన కంటే ఎక్కువగా టీడీపీ – బీజేపీ నేతలే తెగ ఫీలయిపోతున్నారని కామెంట్లు వచ్చాయి. ఇక్కడ బీజేపీ నేతలు అంటే అందరూ కాదనుకోండి… అధికారికంగా బీజేపీలో ఉన్న టీడీపీ అనధికారిక నేతలు… అది వేరే విషయం!! అనంతరం ఇది “కమ్మ” కులస్థులపై దాడి అనేవరకూ వ్యవహారం వచ్చింది.
రాజ్యాంగ బద్ధమైన కీలక పదవిలో ఉన్న వ్యక్తిపై అలాంటి విమర్శలు ఏమిటి? అంత నిస్సిగ్గు పనులు ఆయన చేస్తారా.. అలాంటి చిల్లర ఆలోచనలు, చీఫ్ వ్యవహారాలు రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఆలోచనల్లోకి అయినా వస్తాయా.. ఆయనకు అన్ని పార్టీలూ సమానమే.. ఆయనకు అసలు పార్టీలతోనూ, ఆ పార్టీల నేతలతోనూ సంబందం ఉండదు.. ఆ పార్టీ ఈ పార్టీ అనే తారతమ్యాలు ఉండవు.. అంటూ అప్పట్లో నిమ్మగడ్డకు అనుకూలంగా మాటలు, వార్తలు వచ్చాయి! ఆ సంగతులు అలా ఉంటే… నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తాజాగా రాజకీయ పార్టీలకు చెందిన ఇద్దరు నేతలతో భేటీ అయ్యారు!
హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో ఈనెల 13న ఉదయం 10:40 గంటలకు ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్.. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి టీడీపీ సీనియర్ నేత కామినేని శ్రీనివాస్ లతో భేటీ అయ్యారన్న విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా.. ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.
దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం సాగిందట. దీనికి సంబంధిన వీడియో రికార్డులు సోషల్ మీడయాలో వైరల్ గా మారాయి! దీంతో… నిమ్మగడ్డ విషయంలో కొందరు వైకాపా నేతలు చేస్తున్న విమర్శలకు, ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలకు ప్రజలనుంచి బలమైన మద్దతు ఈ సందర్భంగా వెలువడుతుంది.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉండే నేతల్లో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు ఇద్దరు! వారితో ఎన్నికల అధికారికి రహస్య చర్చలు జరపాల్సిన అవసరం ఏమిటి? పైగా మరోవైపు రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో జరిగిన ఈ భేటీని ప్రజలు ఎలా అర్ధం చేసుకోవాలో ఈ నేతలతో పాటు నిమ్మగడ్డ కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది పలువురి మాటగా ఉంది!
ప్రజలో, వారిలో పలువురో అడిగారని కాదు కాని… రాజ్యాంగ బద్ధమైన కీలక పదవిలో ఉన్న వ్యక్తి, పైగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి.. రాజకీయ పార్టీల నేతలతో రహస్య భేటీలేమిటి.. రహస్య చర్చలు ఏమిటి… ప్రజలు వీటిని ఎలా అర్ధం చేసుకోవాలి… ఈ భేటీని ప్రజలు “బేరాల భేటీ” అని నమ్మేలోపు వీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కానిపక్షంలో… వైకాపా నేతలు చేస్తున్న విమర్శలు, కొంతమంది ప్రజలు అనుకుంటున్న ఆలోచనలు నిజమని అంతా నమ్మే పరిస్థితి రావొచ్చు!!