కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఏపీకి రానున్నారు. ఈరోజు ఆమె విజయవాడలో పర్యటనలో భాగంగా ఏపీ వస్తున్నారు. ఈ మధ్యాహ్నం 12.25 నిమిషాలకు చెన్నై నుంచి హైదరాబాద్ రానున్న మంత్రి అక్కడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని అడివి నెక్కలంలోని గూడవల్లి సర్కిల్ వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రంలో నేరుగా రైతులను కలిసి మాట్లాడనున్నారు.
అనంతరం నేరుగా విడిది గృహానికి చేరుకొని 3.00 గంటలకు కేంద్ర ప్రభుత్వ అధికార కార్యక్రమంలో ఆమె పాల్గొనున్నారు. నాలుగు గంటలకు ది వెన్యూ కన్వెన్షన్ హాలులో వ్యవసాయ బిల్లులపై రైతులు, వ్యవసాయరంగ నిపుణులుతో నిర్వహించే చర్చా కార్యక్రమంలో సీతారమన్ పాల్గొననున్నారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రైతు పంటలకు మద్దతు ధర కల్పించేందుకే కేంద్రం కొత్త చట్టాలను తీసుకొచ్చిందని, ఈ వ్యవసాయ చట్టాలకు రైతులకు పంట అమ్ముకునే స్వేచ్ఛ లభిస్తుందని తెలిపారు. ప్రస్తుతం 20కి పైగా పంటలకు ఎంఎస్పీని కల్పిస్తున్నామని, వరి, గోధుమలకు మినహా మిగతా పంటలను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోలేదని మండిపడ్డారు.