మధ్యలో ఆగిపోయిన మధ్య తరగతి, దిగువ తరగతి వర్గాల గృహాల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రత్యేక విండో ప్రవేశపెట్టినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం చెప్పారు.4.58 లక్షల ఇళ్లతో నిలిచిపోయిన 1,600 గృహనిర్మాణ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రత్యామ్నాయ నిధుల కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించినట్టు ఆమె స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం రూ .10,000 కోట్లు, ఎస్‌బిఐ, ఎల్‌ఐసి వంటివి మొత్తం రూ .25 వేల కోట్ల నిధులను సృష్టిస్తాయని కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ నిధులను ముంబైలో రు. 2 కోట్ల కన్నా తక్కువ, ఢిల్లీ, చెన్నై, ఇతర మెట్రోలలో 1.5 కోట్లు, ఇతర నగరాల్లో రు. కోటి విలువైన హౌసింగ్ యూనిట్లను త్వరగా పూర్తి చేసేందుకు వాడతారు.
మనదేశంలో రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) పరిష్కరించే పనిలో ఉన్నాయని సీతారామన్ పేర్కొన్నారు, రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా పరిష్కరించలేదని అంగీకరించారు. ఇది అనేక రంగాలపై తీవ్రంగా ప్రభావం చూపనుందని ఆమె తెలిపారు.