పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ అక్కడి బుర్ద్‌వాన్ అనే జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ.. భారత జాతికి చెందిన ఆవుల పాలలో బంగారం ఉంటుందని అన్నారు.
బీజేపీ నాయకులకు వింతైన వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో ఆవు గురించి పలువురు బీజేపీ నాయకులు నిరాధారమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మరొక బీజేపీ నేత ఆ జాబితాలో చేరిపోయారు. ఇంతకీ ఆయన ఏమంటున్నారంటే.. ఆవు పాలలో బంగారం ఉంటుందట. ఏంటీ.. షాకయ్యారా.. అవును.. అందుకు ఆయన వివరణ కూడా ఇస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ అక్కడి బుర్ద్‌వాన్ అనే జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ.. భారత జాతికి చెందిన ఆవుల పాలలో బంగారం ఉంటుందని అన్నారు. అందుకనే వాటి పాలు పసుపు రంగులో ఉంటాయని తెలిపారు. విదేశీ ఆవుల పైభాగం సమతలంగా ఉంటుందని, కానీ భారతీయ ఆవులపై ఉండే మూపురం వల్ల దానిపై సూర్య కిరణాలు పడినప్పుడు అందులో బంగారం తయారవుతుందని, ఈ క్రమంలో ఆవు పాలిచ్చినప్పుడు అందులో బంగారం కలిసి వస్తుందని, అందుకనే ఆవు పాలలో బంగారం ఉంటుందని, అవి మనకు పసుపు రంగులో అందుకనే కనిపిస్తాయని.. అన్నారు.
కాగా దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయన మతిలేని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. దీంతో ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది..!