తెలంగాణలో ప్రతి ఏడాది బోనాల ఉత్సవాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి. కానీ ఈ సారి మాత్రం కరోనా మహమ్మారి వల్ల బోనాల ఉత్సవాలు జరగడం లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్రస్తుతం కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ఈ సారి బోనాల ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఇక ఈసారి అమ్మవార్లకు పూజారులే బోనాలను సమర్పిస్తారని ఆయన తెలిపారు.
ప్రతి ఏటా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాలు ఉత్సవాలు వైభవంగా కొనసాగుతాయి. గోల్కొండ బోనాలు ముందుగా ప్రారంభమై.. తరువాత మహంకాళి బోనాలతో ఉత్సవాలు ముగుస్తాయి. దీంతో ఆ సమయంలో జంట నగరాల్లో ఎటు చూసినా ఆధ్యాత్మికత ఉట్టి పడుతుంది. ఇక ఆనవాయితీ ప్రకారం ఈ నెల 25న గోల్కొండ బోనాలు ప్రారంభం కావల్సి ఉంది. కానీ కరోనా వల్ల బోనాలను నిర్వహించడం లేదు.
కేంద్రం సడలించిన ఆంక్షల ప్రకారం జూన్ 8 నుంచి ఆలయాల్లో భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుంది. అయినప్పటికీ జంట నగరాల్లో నమోదవుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఈసారి బోనాలను నిర్వహించడం లేదు.