డ్రగ్స్ కేసులో మంత్రికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా ?

-

బెంగుళూరు డ్రగ్స్ కేసు తెలంగాణలో అధికార పార్టీని కలవరపెడుతోంది. హైదరాబాద్ పంజాగుట్టకు చెందిన పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పారిశ్రామిక వేత్తలతో పాటు ఓ మంత్రి కూడా ఉన్నారన్న చర్చ మొదలైంది. రేపో మాపో ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వనున్న పోలీసులు మంత్రి కి కూడా నోటీసులు ఇస్తారా అన్న చర్చ మొదలైంది. ఒక వేళ మంత్రికి నోటీసులు ఇస్తే ప్రభుత్వం ఇరకాటంలో పడే చాన్స్ ఉండటంతో ప్రభుత్వవర్గాల్లోను కొత్త టెన్షన్ మొదలైంది.

అటు బెంగుళూర్ డ్రగ్ కేసు విచారణను వేగవంతం చేశారు కర్ణాటక పోలీసులు. హైదరాబాద్ బిజినెస్‌ మెన్‌ లు కలహర్ రెడ్డి, రతన్ రెడ్డిలకు గోవిందపురా పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. త్వరలోనే తెలంగాణ ఎమ్మెల్యేలకు కూడా డ్రగ్స్ కేసులో నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే, హైదరాబాద్ కు చెందిన ఒక ఎమ్మెల్సీతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే పేరు కూడా ఈ కేసులో వినిపిస్తోందట. ఇప్పటి వరకు రాజకీయ నాయకుల పేర్లను కర్ణాటక పోలీసులు బయటపెట్టలేదు.

తెలంగాణ క్యాబినెట్ లోని ఓ మంత్రికి బెంగుళూరు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల కొందరు స్నేహితులతో కలిసి ఆ మంత్రి శ్రీలంక టూర్ కు వెళ్లారని.. అక్కడే సదరు మంత్రి డ్రగ్స్ విషయంలో కల్పించుకున్నారని తెలుస్తోంది. అంతటితో ఆగకుండా హైదరాబాద్ కు డ్రగ్స్ తన వెంట తెచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి అనుచరులతో పాటు ఎమ్మెల్యేలు కూడా డ్రగ్స్ తీసుకున్నారని, ఆ ఆధారాల కోసం ఇప్పుడు కర్ణాటక పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. శ్రీలంక టూర్ లో జరిగిన పార్టీలో వచ్చిన డ్రగ్స్ బెంగళూరు నుంచే సరఫరా అయినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.

బెంగళూరు పోలీసులు డ్రగ్స్ కేసులో విచారణకు రావాల్సిందిగా మంత్రికి నోటీసులు ఇస్తే పరిస్థితి ఏంటని గులాబీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. మంత్రి పై వచ్చిన ఆరోపణలను ఇప్పటికే ఆ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. కానీ డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని నిరూపించుకునే వరకు మంత్రి పదవికి దూరంగా ఉంటారా లేదా అనే చర్చ కూడామొదలైందట. అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సార్లు బహిరగంగా చెప్పారు. ప్రస్తుతం ఏ విధమైన ఆధారాలు లేకుండా ప్రతిపక్షాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేస్తున్నాయని అధికార పార్టీ నేతలు కొట్టి పారేస్తున్న ఇది ఏ మలుపు తిరుగుతుందో అన్న టెన్షన్ అధికారపార్టీలో మొదలైంది. మరోపక్క ఈ డ్రగ్స్ కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని వారికి నార్కోటిక్ పరీక్షలు నిర్వహించాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version