విజయనగరం జిల్లా రాజకీయాల్లో మరో యువ నాయకురాలు అడుగు పెట్టపోతున్నారా ? అది కూడా రాజకీయంగా పేరు మోసిన.. గజపతుల కుటుంబం నుంచే యువ నాయకురాలు రానున్నారా ? అంటే.. ఔననే అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం గజపతుల వంశం నుంచి ముగ్గురు నేతలు రాజకీయాల్లో ఉన్నారు. వీరిలో ఇద్దరు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. వారే విజయనగరం టీడీపీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ఆయన కుమార్తె అదితి గజపతిరాజు. ఇద్దరూ కూడా టీడీపీలోనేఉన్నారు. గత ఎన్నికల్లో అదితి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు.
అయినా కూడా టీడీపీలో దూకుడుగానే ఉన్నారు అదితి. ఇక, ఇదే గజపతుల కుటుంబంలోని ఆనంద గజపతి రాజు తొలి వివాహానికి కలిగిన.. సంచయిత గజపతిరాజు కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. అయితే, ఆమె రాష్ట్రంలో కన్నా.. జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పుతున్నారు. పేరు పెద్దగా ఇక్కడి వారికి తెలియక పోయినా.. బీజేపీలో ప్రధాన కార్యదర్శి హోదాలో సంచయిత వ్యవహరిస్తున్నారు. ఇటీవలే.. సింహాచలం ఆలయ బోర్డు, మాన్సాస్ ట్రస్ట్ బోర్డుల చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఈ విషయంలో వివాదం నడుస్తోంది.
ఇదిలావుంటే… ఆనంత గజపతి రాజు కుటుంబం నుంచి ఆయన రెండో భార్య కుమార్తె ఊర్మిళా గజపతి రాజు.. త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించడం రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. “రాజకీయాలంటే ఆసక్తి ఉంది. కాకపోతే… విద్యాభ్యాసం మొత్తం పూర్తయిన తరువాత రాజకీయాలలోకి వస్తా“ అని స్వయంగా ఊర్మిళ వెల్లడించడంతో గజపతుల వంశం నుంచి మరో నాయకురాలు రావడం ఖాయమనే విషయం స్పష్టమైంది. అయితే, ఏపార్టీ అనేది తెలియాల్సి ఉంది.
సహజంగా.. ఊర్మిళకు వరుసకు బాబాయి అయ్యే.. అశోక్ గజపతి రాజుతో మంచి సంబంధ బాంధ్యవ్యాలు కొనసాగుతుండడం. అశోక్ కుమార్తె అదితితోనూ ఊర్మిళకు కుటుంబ సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఊర్మిళ టీడీపీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో బ్యాచ్ లర్ ఆఫ్ మేనేజ్ మెంట్ కోర్స్ పూర్తి చేసింది. పీజీ కూడా అక్కడే చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో వచ్చే ఏడాదిలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.