ఏపీలో వైసీపీ అధినేత జగన్ పాలనా పగ్గాలు చేపట్టి.. ఏడాది పూర్తవుతున్న సమయంలో పార్టీ తరపున, ప్రభుత్వం తరఫున కూడా భారీ ఎత్తున సంబరాలు చేసుకునేందుకు నాయకులు రెడీ అవుతున్నారు. ఈ సమయంలో ఈ ఏడాది పాలనపై బహుముఖ రీతిలో పరిశీలన, సమీక్షలు నిర్వహిస్తున్నారు. జగన్ ఏడాది పాలనలో అనేక మెరుపులు.. మనకు కనిపిస్తాయి. పాలన విషయంలో జగన్ తనదైన శైలితోపాటు.. తన తండ్రి వైఎస్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనుసరించిన విధానాలను కూడా కలగలిపి.. ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువ చేస్తున్నారు.
గత వైఎస్ పాలనలో కీలకమైన పథకాలను జగన్ ఇప్పుడు తన పాలనలోనూ ప్రజలకు చేరువ చేస్తున్నా రు. పేదలకు కీలక పథకంగా వైఎస్ ప్రభుత్వాన్ని రెండోసారి కూడా అధికారంలోకి తీసుకువచ్చిన ముఖ్యమైన పథకం.. ఆరోగ్య శ్రీ. గత చంద్రబాబు పాలనలో ఈ పథకాన్ని తీవ్రస్థాయిలో నీరుగార్చారు. అలాంటి పథకాన్ని జగన్ మళ్లీ ఊపిరులూది.. ప్రతి ఒక్కరికీ(ఆదాయం 5 లక్షల లోపు ఉన్నవారికి) ఆరోగ్య శ్రీని చేరువ చేశారు. ఇక, ఫీజు రీయింబర్స్‌ను మరింత పెంచి.. మెజారిటీ వర్గానికి మేలు చేసే కార్యక్రమం చేపట్టారు. అదేసమయంలో వైఎస్ హయాంలో పురుడు పోసుకున్న పోలవరం ప్రాజెక్టును వచ్చే 2021 నాటికి ఎట్టిపరిస్థితిలోనూ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఇక, ఎస్సీ, బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడంలోనూ వైఎస్ బాటలోనే జగన్ నడుస్తున్నారు. మైనార్టీ వర్గాలకు మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా వారికి స్కాలర్ షిప్పులు, నామినేటెడ్ పదవులు ఇచ్చారు. అదేసమ యంలో అన్ని మతాల్లోనూ ప్రచారకర్తలకు నెలనెలా గౌరవ వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇక, మరో కీలకమైన అంశం.. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం. వైఎస్ హయాంలో హోం శాఖ మంత్రి మహిళ కు అవకాశం ఇచ్చి రికార్డు సృష్టించారు. ఇప్పుడు జగన్ కూడా తన పాలనలో మహిళకు, అందునా ఎస్సీ వర్గానికి చెందిన మహిళకు హోం మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు. ఇలా.. గత వైఎస్ హయాంలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా అయితే.. ఆయన ప్రజలకు చేరువ అయ్యారో… వాటిని జగన్ పూర్తి చేస్తూ.. ముందుకు సాగుతున్నారనడంలో సందేహం లేదు.