Scam Alert : OLX మోసాలు.. నెక్స్ట్‌ మోసపోయేది మీరే కావొచ్చు

-

సైబ‌ర్ మోసాల ప‌ట్ల ప్ర‌జ‌లు ఎంత అప్ర‌మ‌త్తంగా ఉన్న‌ప్ప‌టికీ దుండగులు మాత్రం కొత్త కొత్త దార్లు వెతుక్కుంటున్నారు. రోజుకో న‌యా పంథాలో జ‌నాల‌ను మోసం చేస్తున్నారు.

”ర‌మేష్ ఒక కంపెనీలో ఉద్యోగి. నిత్యం ఆఫీసుకు బైక్‌పై వెళ్తుంటాడు. టూవీల‌ర్ క‌న్నా కారు సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని చెప్పి కారు కొందామ‌నుకున్నాడు. కానీ కొత్త కారుకు బాగా డబ్బు కావాల‌ని చెప్పి సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఓ క్లాసిఫైడ్ సైట్‌లో మంచి కారు చూశాడు. ధ‌ర త‌క్కువ‌. చూసేందుకు కారు బాగానే ఉంది. ఇంకేం.. వెంట‌నే దాన్ని అమ్మే వ్య‌క్తికి కాల్ చేశాడు. అత‌ను కారు ఫ‌లానా ప్రాంతంలో ఉంది.. తను ఆర్మీలో జాబ్‌ చేస్తాను ప్రస్తుతం ఇంటి దగ్గర లేనంటూ చెప్పి, వ‌చ్చి చూసుకోమ‌ని అడిగాడు. అందుకు ర‌మేష్ స‌రేన‌ని చెప్పి ఆ కారు వ‌ద్ద‌కు వెళ్లి చూశాడు. కారు నిజంగానే బాగుంది. ఇంకేముంది.. ఎలాగైనా దాన్ని కొనాల‌ని రేటు అడిగాడు. ఆన్‌లైన్‌లో ఉంచినంతే రేటు అని అవ‌త‌లి వ్య‌క్తి చెప్ప‌డంతో ర‌మేష్ స‌రేన‌న్నాడు. అయితే ఆ వ్య‌క్తి త‌న‌కు ముందుగా రూ.40వేలు పంపాల‌ని, రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో మిగిలిన మొత్తం ఇవ్వాల‌ని కోర‌డంతో ర‌మేష్ న‌మ్మి అత‌ను చెప్పిన‌ట్లుగానే రూ.40వేలు అత‌ని ఖాతాకు పంపాడు. ఆ త‌రువాతే ర‌మేష్‌కు అస‌లు విష‌యం తెలిసింది.

నిజానికి ఆ కారు ఆ వ్య‌క్తిది కాదు. దాని ఫొటోల‌ను ఇది వ‌ర‌కే వేరే సైట్ల‌లో పెట్టి కొంద‌రి వ‌ద్ద డబ్బులు కాజేశార‌ని తెలిసింది. వారిలో ర‌మేష్ ఒక‌డ‌య్యాడు. నిజం తెలుసుకున్న ర‌మేష్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ వ్య‌క్తికి ఫోన్ చేస్తే.. స్విచాఫ్ అని వ‌స్తోంది. దీంతో ర‌మేష్ సైబ‌ర్ క్రైం పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు.. ఇదీ.. ప్ర‌స్తుతం ఆన్‌లైన్ క్లాసిఫైడ్ సైట్ల ద్వారా జ‌రుగుతున్న దోపిడీ.. న‌యా సైబ‌ర్ మోసం.. చాలా మంది కేటుగాళ్లు ప్ర‌స్తుతం ఇదే ప‌ద్ధ‌తిలో జ‌నాల‌ను మోసం చేస్తున్నారు. చాలా వ‌ర‌కు ప్రాంతాల్లో ఈ త‌ర‌హా కేసులు ప్ర‌స్తుతం రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి..!”

సైబ‌ర్ మోసాల ప‌ట్ల ప్ర‌జ‌లు ఎంత అప్ర‌మ‌త్తంగా ఉన్న‌ప్ప‌టికీ దుండగులు మాత్రం కొత్త కొత్త దార్లు వెతుక్కుంటున్నారు. రోజుకో న‌యా పంథాలో జ‌నాల‌ను మోసం చేస్తున్నారు. బ్యాంక్ అధికారుల‌మ‌ని చెప్పి కార్డుల వివ‌రాలు, ఓటీపీ అడ‌గ‌డ‌మో.. ఫోన్లు, కంప్యూట‌ర్లు, మెయిల్స్‌ను హ్యాక్ చేసి స‌మాచారం దొంగిలించి డ‌బ్బు దోచేయ‌డ‌మో.. లాట‌రీ త‌గిలింద‌ని చెప్పి సొమ్ము డిపాజిట్ చేయ‌మ‌ని అడ‌గ‌డ‌మో.. ఇలా ర‌క‌ర‌కాలుగా జ‌నాల‌ను సైబ‌ర్ నేర‌గాళ్లు మోసం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో మ‌న దేశంలో నిత్యం కొన్ని ల‌క్ష‌ల మంది సైబ‌ర్ నేరాల బారిన ప‌డుతున్నారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ పేరిట జ‌నాల‌ను దోచుకోవ‌డం మ‌రీ ఎక్కువైపోయింది. అందుకు ప్ర‌ముఖ క్లాసిఫైడ్ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చే వెబ్‌సైట్లు ఓఎల్ఎక్స్‌, క్విక‌ర్‌లు వేదిక‌లవుతున్నాయి.

సాధార‌ణంగా మ‌న దేశంలో కొత్త వ‌స్తువుల‌ను ఎలాగైతే కొంటారో.. సెకండ్ హ్యాండ్ వ‌స్తువుల‌ను కొనేవారు కూడా చాలా మందే ఉంటారు. ఈ క్ర‌మంలో సెకండ్ హ్యాండ్ వ‌స్తువుల‌ను కొనుగోలు చేసేందుకు మ‌న‌కు అనేక వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఓఎల్ఎక్స్‌, క్విక‌ర్‌లు బాగా పేరుగాంచాయి. త‌క్కువ ధ‌ర క‌లిగిన వ‌స్తువులు మొద‌లుకొని కొన్ని ల‌క్ష‌ల రూపాయ‌ల విలువ చేసే కార్లు, స్థ‌లాలు, ఇండ్లు.. ఇలా ర‌క‌ర‌కాల వ‌స్తువుల‌ను సెకండ్ హ్యాండ్‌లో మ‌న‌కు చాలా మంది ఆయా వెబ్‌సైట్ల‌లో విక్ర‌యిస్తున్నారు. అయితే దీన్ని ఆస‌రాగా చేసుకుని కొంద‌రు దుండ‌గులు.. సెకండ్ హ్యాండ్ వ‌స్తువుల‌ను అమ్ముతున్నామ‌ని చెప్పి వినియోగ‌దారుల‌ను మోసం చేస్తున్నారు.

ఓఎల్ఎక్స్ సైట్‌లోనే కాదు, దాని లాంటి ఇత‌ర క్లాసిఫైడ్ ప్ర‌క‌ట‌న‌లిచ్చే సైట్లలోనూ మ‌న‌కు అనేక ర‌కాల సెకండ్ హ్యాండ్ వ‌స్తువులు అందుబాటులో ఉన్నాయి. ధ‌ర తక్కువ‌.. పైగా మ‌న‌కు న‌చ్చిన సెకండ్ హ్యాండ్ వ‌స్తువును కొన‌వ‌చ్చ‌నే ఉద్దేశంతో మ‌నం ఆ సైట్ల‌ను చూస్తుంటాం. కానీ వాటిల్లో ఆయా వ‌స్తువులను అమ్ముతామ‌ని పెట్టే ఫొటోల్లో ఎక్కువ‌గా న‌కిలీవే ఉంటున్నాయి. దీంతో వాటిని చూసిన కొంద‌రు నిజంగానే ఆ వస్తువును చాలా త‌క్కువ ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని చెప్పి.. ఆశ‌ప‌డి వాటిని అమ్ముతున్న వారిని కాంటాక్ట్ అవుతున్నారు. దీంతో అవ‌త‌లి వారు త‌మ అకౌంట్‌లో డ‌బ్బులు జ‌మ చేస్తే వ‌స్తువును పంపిస్తామ‌ని చెబుతుండ‌డంతో అది నిజ‌మే అని న‌మ్మే కొంద‌రు వారి ఖాతాకు డ‌బ్బులు పంపుతున్నారు. అనంత‌రం డ‌బ్బులు జ‌మ కాగానే దుండ‌గులు త‌మ ఫోన్ల‌ను స్విచాఫ్ చేస్తున్నారు. ఆ త‌రువాత అదే ఫొటోను వేరే క్లాసిఫైడ్ సైట్‌లో అప్‌లోడ్ చేసి తిరిగి అదే ప‌ద్ధ‌తిలో వేరే వారి దగ్గ‌ర్నుంచి కూడా డ‌బ్బులు కాజేస్తూ సైబ‌ర్ నేర‌గాళ్లు త‌మ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయ‌లుగా కొన‌సాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version