ఏపీ రూ. 10,742 కోట్లతో చేపట్టనున్న పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పూర్తయిన పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. మరోవైపు మోదీ సభకు 3 లక్షల మంది వరకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. సభ జరగనున్న మద్దిలపాలెం జంక్షన్ ప్రాంతం ఇప్పటికే జన సంద్రంగా మారింది.
మరోవైపు, ప్రధాన వేదికపై ప్రధాని మోదీతో పాటు మరో ముగ్గురు మాత్రమే ఆశీనులు కానున్నారు. వీరిలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వేదికను అలంకరించారు. ఈ రెండు వేదికల్లో ఒక వేదికపై రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ సహా మరో 15 మంది బీజేపీ నేతలు హాజరవుతారు. మరో వేదికను 300 మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. అతిథుల కోసం మరో 2 వేదికలను ఏర్పాటు చేశారు.