డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తంలో కచ్చితమైన లాభాలను అందించే స్కీంలలో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీం కూడా ఒకటి. దేశంలోని అనేక బ్యాంకులు ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇక ఆయా బ్యాంకులు ఎఫ్‌డీలకు భిన్న రకాల వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. కనీసం 7 రోజుల నుంచి 10 సంవత్సరాల గరిష్ట కాలవ్యవధి వరకు ఎఫ్‌డీ చేసుకునే సదుపాయాన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. అయితే ఎవరైనా సరే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేముందు కింద తెలిపిన పలు విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. అవేమిటంటే…
1. భిన్న రకాల బ్యాంకులు తాము అందించే ఎఫ్‌డీ స్కీంలకు భిన్న రకాల వడ్డీ రేట్లను అందిస్తుంటాయి. కనుక వాటిని ఒక్కసారి పోల్చి చూడాలి. ఎక్కువ వడ్డీ రేట్లను అందించే ఎఫ్‌డీలను ఎంచుకోవాలి. దీంతో మెచూరిటీ తీరాక పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వస్తుంది.
2. వినియోగదారులు చేసే ఎఫ్‌డీలకు వడ్డీని నెల నెలా లేదా 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలు, 12 నెలలకు ఒకసారి చెల్లిస్తారు. ఇక కొన్ని ఎఫ్‌డీలకు మెచూరిటీ తీరాక వడ్డీని లెక్కించి ఇస్తారు. అందువల్ల ఎఫ్‌డీ చేసేటప్పుడు వడ్డీని ఎలా చెల్లిస్తారో తెలుసుకోవాలి. దీంతో ఎఫ్‌డీపై వచ్చే వడ్డీని మనకు కావల్సినప్పుడు పొందేందుకు అవకాశం ఉంటుంది.
3. చాలా వరకు బ్యాంకులు వినియోగదారులు చేసే ఎఫ్‌డీలకు లోన్లను అందిస్తుంటాయి. ఎఫ్‌డీలను సెక్యూరిటీగా పెట్టుకుని లోన్లు ఇస్తారు. అయితే వినియోగదారులు డిపాజిట్ చేసిన మొత్తం నుంచి బ్యాంకులు నిర్దిష్టమైన మొత్తం వరకే లోన్లను ఇస్తాయి. సాధారణంగా బ్యాంకులు ఎఫ్‌డీలో 75 శాతం వరకు లోన్ ఇస్తాయి. కొన్ని బ్యాంకులు ఇంతకన్నా తక్కువగా, మరికొన్ని ఎక్కువగా లోన్లు ఇస్తాయి. ఈ వివరాలను తెలుసుకుని మరీ ఎఫ్‌డీలను ఓపెన్ చేస్తే మంచిది.
4. వినియోగదారులు ఎఫ్‌డీలను ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీల రూపంలోనూ ఓపెన్ చేయవచ్చు. అయితే ఇద్దరు అకౌంట్ హోల్డర్లు జాయింట్‌గా ఎఫ్‌డీని ఓపెన్ చేసే పక్షంలో వారిలో ప్రైమరీ అకౌంట్ హోల్డర్‌కు మాత్రమే ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ బెనిఫిట్స్ ను అందిస్తారు.
5. సాధారణంగా వినియోగదారులు ఎఫ్‌డీలను ఓపెన్ చేస్తే వాటిని మెచూరిటీ తీరే వరకు ఉంచాల్సిందిగా బ్యాంకులు కస్టమర్లను కోరుతుంటాయి. అయితే కొన్ని ఎఫ్‌డీలను మెచూరిటీ తీరక ముందు ఓపెన్ చేయడం కుదరదు. కనుక ఎఫ్‌డీని ఓపెన్ చేసేటప్పుడే ఈ విషయాన్ని వెరిఫై చేసుకోవాలి. ఇక అత్యవసర సమయం వస్తే మెచూరిటీ తీరకున్నా ఎఫ్‌డీని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే అందుకు భిన్న రకాల బ్యాంకులు భిన్నంగా పెనాల్టీలను విధిస్తాయి. కనుక వాటి గురించి కూడా తెలుసుకుని మరీ ఎఫ్‌డీలను ఓపెన్ చేస్తే మంచిది.
6. ఎఫ్‌డీల మీద పొందే వడ్డీకి కచ్చితంగా ట్యాక్స్ విధిస్తారు. అయితే అది నిర్దిష్టమొత్తంలో ఉంటుంది. కనుక ఆ మొత్తం గురించి తెలుసుకోవాలి. లేదంటే ఎఫ్‌డీ ద్వారా వచ్చే వడ్డీ లోంచి ట్యాక్స్‌ను కట్టాల్సి ఉంటుంది. ఇక ఎఫ్‌డీ ద్వారా వచ్చే వడ్డీకి టీడీఎస్ కూడా కట్ చేస్తారు. కానీ దీన్ని తప్పించాలంటే బ్యాంకులకు 15జి లేదా 15హెచ్ ఫాంలను సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.