ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థల సంయుక్త భాగస్వామ్యంలో రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్‌కు గాను ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్‌ను దేశంలో 5 చోట్ల చేపట్టనున్నారు. ఈ మేరకు సదరు వర్సిటీ, సంస్థలతో వ్యాక్సిన్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకున్న భారత్‌కు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆ 5 ప్రాంతాలను ఎంపిక చేసింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ సదరు ప్రాంతాల వివరాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి అందజేసింది. ఈ క్రమంలో ఆగస్టు చివరి వరకు ఆయా ప్రాంతాల్లో ఆక్స్‌ఫర్డ్ కోవిడ్ వ్యాక్సిన్‌కు ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమవుతాయి.
ఆక్స్‌ఫర్డ్ కోవిడ్ వ్యాక్సిన్‌కు ఏప్రిల్, మే నెలల్లో యూకేలో మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టారు. 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 1077 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తులకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ క్రమంలో వారిలో 56 రోజుల తరువాత కూడా కరోనా వైరస్‌కు యాంటీ బాడీలు అలాగే ఉన్నట్లు గుర్తించారు. అందువల్ల వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇస్తుందని వారు భావిస్తున్నారు.
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇప్పటికే ఆ యూనివర్సిటీ, సంస్థలతో వ్యాక్సిన్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలోనే ఫేజ్ 3 ట్రయల్స్ ప్రారంభం కాగానే 300 మిలియన్ల డోసులను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుంది. ఆ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేసే కరోనా వ్యాక్సిన్ డోసుల్లో సగం డోసులను నెల నెలా భారత్‌కే కేటాయిస్తామని ఇప్పటికే తెలిపారు. ఈ క్రమంలో సెప్టెంబర్ చివరి నాటికి వ్యాక్సిన్ ప్రజా పంపిణీకి సిద్ధమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక భారత్‌లో మొత్తం 5వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చి ఫేజ్ 3 ట్రయల్స్ చేపట్టనున్నారు.