ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్.. ఎక్కడో తెలుసా..?!

-

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ సమయంలో బాధితులకు ఆక్సిజన్ సరఫరా చాలా అవసరం. అయితే మీరు రింజిమ్ ఇస్పాట్ పేరు ఎప్పుడైనా విన్నారా.. ఇది ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఉండే స్టైయిన్‌లెస్ స్టీల్ తయారీ సంస్థ. ప్రపంచంలోని ప్రముఖ సంస్థలలో ఇది కూడా ఒకటి. భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ. అయితే ఈ సంస్థ కరోనా బాధితులను ఆదుకోవడానికి ఆక్సిజన్ సిలిండర్లను రూ.1కే ప్రారంభించింది.

ఆక్సిజన్ సిలిండర్

మొదట్లో ఉత్తరప్రదేశ్‌లోనే ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేసినా.. ఆ తర్వాత పక్క రాష్ట్రాలకు కూడా సరఫరాను ప్రారంభించింది. దాదాపు రెండున్నర వేలకు పైగా ఆక్సిజన్ సిలిండర్లను రింజిమ్ ఇస్పాట్ తన ఆక్సిజన్ ప్లాంట్ నుంచి సరఫరా చేస్తోంది. ఈ సందర్భంగా సంస్థ యజమాని యోగేశ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘ఉక్కు ఉత్పత్తిలో రూ.కోట్లలో ఆదాయం పొందవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాలని అనిపించింది. అందుకే మానవత్వంతో ముందుకు వచ్చాను. భారత్‌లో ఆక్సిజన్ కొరత ఏర్పడటం వల్లే ఆక్సిజన్ ప్లాంట్ నుంచి రూ.1కి ఆక్సిజన్ సిలిండర్ సరఫరా చేస్తున్నాము. వ్యాపారంలో నష్టం వచ్చినా పర్వాలేదు. కానీ ప్రతిఒక్కరికి ఆక్సిజన్ అందాలన్నదే నా ధ్యేయం. ఆక్సిజన్ లేకపోవడం.. సరైన సమయానికి ఆక్సిజన్ సరఫరా జరగకపోవడంతో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాము.’’ అని పేర్కొన్నారు.

400 టన్నుల ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు..
రోజుకు 400 టన్నులు ఉత్పత్తి చేసే ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు యోగేశ్ అగర్వాల్ తెలిపారు. కానీ విద్యుత్‌పై క్రాస్ సబ్సిడీ విధించడానికి ప్రభుత్వం ఆమోదం తెలుపలేదు. దీంతో విద్యుత్ ఖర్చు ఎక్కువగా పడుతోంది. ప్రభుత్వం ఈ విషయంపై నిర్ణయం తీసుకుని, విద్యుత్ సరఫరాపై రాయితీ కల్పిస్తే బాగుంటుందన్నారు. అప్పుడు రాష్ట్రంలోనే అతిపెద్ద ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి.. ఆస్పత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేస్తామన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి దాదాపు రూ.100 కోట్ల వ్యయం ఉంటుందని, విద్యుత్ రాయితీ కల్పిస్తే.. ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయవచ్చని యోగేశ్ అగర్వాల్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version