పాదయాత్ర…తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సక్సెస్ ఫుల్ ఫార్ములా. నాటి వైయస్సార్ నుంచి నేటి జగన్ వరకు ఈ ఫార్ములా వర్కవుట్ అయింది. దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2004 ఎన్నికల ముందు వైఎస్ఆర్, పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని కాంగ్రెస్‌ని బలోపేతం చేశారు. ఆ పాదయాత్ర ఫలితంగానే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బాగా కలిసొచ్చింది. కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చింది.
ఇదే పాదయాత్ర ఫార్ములాని 2014 ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఫాలో అయ్యారు. సుదీర్ఘంగా ఉమ్మడి ఏపీలో పాదయాత్ర చేశారు. అటు వైసీపీ తరఫున షర్మిల పాదయాత్ర చేశారు. కానీ రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఆ పాదయాత్ర ఫార్ములా ఏపీలో చంద్రబాబుకు వర్కౌట్ అయింది. 2014 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.
ఇక 2019 ఎన్నికల ఏపీలో జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేశారు. దీంతో 2019 ఎన్నికల్లో జగన్ భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చారు. కానీ తెలంగాణలో ఇంతవరకూ ఏ ప్రతిపక్ష పార్టీ నాయకుడు పాదయాత్ర చేయలేదు. కానీ ఇప్పుడు బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆగష్టు 24 నుంచి ఈ పాదయాత్ర మొదలు కానుంది. సుదీర్ఘంగా చేసే ఈ పాదయాత్ర బిజెపికి కలిసొచ్చే అవకాశాలున్నాయి. కాకపోతే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది.
ఒకవేళ రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేస్తే అప్పుడు రాజకీయాలు మారిపోతాయి. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో ఈ పాదయాత్ర ఫార్ములా బండికి వర్కౌట్ అవుతుందో లేక రేవంత్ రెడ్డికి వర్కౌట్ అవుతుందో చూడాలి.