సంక్రాంతి తరువాత పల్లెలు ఎలా ఉంటాయి. సంక్రాంతి తరువాత పల్లెలతోపాటు సంతలు ఎలా ఉంటాయి.. కొద్దిగా బియ్యం, కాసిన్నికూరగాయలు ఇంటికి తెచ్చుకుని తరువాత ఆ పాట ఈ పాట వినిపించి తమ గానామృతం పంచే బిడ్డలు వీరు.. దేశం గర్వించే స్థాయిలో వీరి జీవనం ఉంటుందా ఏమో కానీ వీరి పాట ఉంటుంది.. పాట ఓ మైమరుపు అయి ఉంటుంది. మన ఇంటి విజయాలు ఇలానే ఉంటాయి.. అతి సామాన్య స్థితిలో ఉంటాయి.. మొగులయ్య సాధించాల్సినది ఎంతో! ఆయన పాటకు జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వడమే మనం సాధించిన విజయం..మనం అధిరోహించిన శిఖరం.
సంతల్లో వినిపించే పాట.. జాతరలో వినిపించే పాట. మన తెలంగాణ పాట..ఆయన పాటను కథను ఏకకాలంలో వినిపించే తీరు పవన్ ను అబ్బుర పరిచిందండి. పవన్ పిలిచి భీమ్లా నాయక్ కు పాడించారు. చేతిలో రెండు లక్షల రూపాయలు ఉంచి పంపారు.
ఇప్పుడు కేంద్రం పద్మ పురస్కారం ఇచ్చి ఓ సామాన్య కళాకారుడ్ని నెత్తిన పెట్టుకుంది. ఇది తెలంగాణ సమాజంకు గుర్తింపు.. మరుగున పడిపోతున్న కళలకు ప్రాణం ఇచ్చిన మొగులయ్య దర్శనం మనందరికీ పండుగ సంతోషంతో సమానం.
దర్శనం మొగులయ్య పాట వింటే గుండె పులకిస్తుంది. కిన్నెర మెట్లపై ఆయన వినిపించే స్వరాలు ఆనందాలను అందిస్తాయి. ఎన్నో ఏళ్ల కళల వారసత్వాన్ని అందుకున్న గొప్ప గాయకుడు మొగులయ్య. మొగులయ్య పేరు వింటే మనసుకు ఆనందం.. మొగులయ్య గానం తోనే తెలంగాణ వీధులకో సుప్రభాతం. మనం వీళ్లను గౌరవించాలి.. మనం వీళ్లను ఆదరించాలి.. పద్మపురస్కారం వేళ వీరికివే అభినందనలు.