భారత్ ఆర్థిక రాజధాని ముంబైపై జరిగిన ఉగ్రదాడి మూలాలు తమ దేశంలోనే ఉన్నాయని పాకిస్థాన్ అంగీకరించింది. 2008లో జరిగిన దాడిలో పాల్గొన్న 11 మంది ఉగ్రవాదులు తమ గడ్డకు చెందిన వారే అని పాకిస్థాన్‌కు చెందిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ-FIA తెలిపింది. ఈ మేరకు 880 పేజీలకు పైగా సుదీర్ఘ నివేదిక తయారు చేసింది. ఇందులో ముల్తాన్‌కు చెందిన మహ్మద్ అజ్మల్ కసబ్‌తో పాటు పాకిస్థాన్ నుంచి భారత్‌కు చేరుకోడానికి ఉపయోగించిన బోటును కొన్న అల్ ఫౌజ్ పేరు కూడా ఉంది.
ముంబైలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి నవంబర్ 26తో 12 ఏళ్లు పూర్తవుతుంది. ఈ ఉదంతం ప్రపంచ ఉగ్రవాద దాడుల్లోనే అత్యంత ఘోరమైన ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. 2008 నవంబరు 26న పాకిస్థాన్‌లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా ముంబైలోకి లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన అజ్మల్ కసబ్, మరో తొమ్మిది మంది చొరబడ్డారు. ఒబెరాయ్ హోటల్, తాజ్, త్రపతి శివాజీ టెర్మినస్‌ల వద్ద నాలుగు రోజుల పాటు మారణహోమం సృష్టించారు. పది మంది ఉగ్రవాదుల్లో 9 మంది చనిపోగా.. ఈ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మంది వరకు గాయపడ్డారు.