బహిష్కరణ ఎత్తివేసిన తర్వాత మొదటి సారిగా హైదరాబాద్ రానున్న స్వామీజీ
శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిపై నగర బహిష్కరణ వేటుని కోర్టు ఎత్తివేయడంతో మంగళవారం హైదరాబాద్లో అడుగుపెట్టనున్నారు. నగర శివారు ప్రాంతమైన హయత్ నగర్ కి చేరుకోగానే హిందూ, దేవాలయ సంఘాలతో పాటు భాజపా నేతలు స్వామీజీకి ఘనస్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు.
ఉదయం 10 గంటలకు బెజవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి కోదాడ, సూర్యాపేట, చౌటుప్పల్ మీదుగా మధ్యాహ్నం రెండు గంటలకు హయత్ నగర్ చేరుకోనున్నారు. తన అభిమానులతో కలిసి ఎల్బీనగర్ దిల్ సుఖ్ నగర్, కోఠీ మీదుగా బషీర్ బాగ్ చేరుకుని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జూలై 11న పోలీసులు స్వామి పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన హైకోర్టుని ఆశ్రయించగా స్వామీజీపై నగర బహిష్కరణను ఎత్తివేస్తూ తీర్పు ఇచ్చింది.