జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఢిల్లీ పెద్దల నుంచి ఆయనకు పిలుపు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు అన్నీ కూడా ఇప్పుడు ఆందోళన కరంగా ఉన్నాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం అధికార వైసీపీ అరాచకాలు చేస్తుందని జనసేన అధినేత పవన్ పదే పదే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
ముఖ్యంగా వైసీపీ నేతలు కొన్ని చోట్ల రెచ్చిపోతున్నారని పవన్ మండిపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్ర పెద్దలకు బిజెపి ఎంపీలు ఫిర్యాదులు కూడా చేసారు. ఆ తర్వాతే రాష్ట్రంలో ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి. కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పినా పరిస్థితి మాత్రం మరోలా ఉందని వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
రాజకీయంగా ఇప్పుడు ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. స్థానిక ఎన్నికల్లో మనల్ని అడ్డుకొని దౌర్జన్యాలు చేస్తే మౌనంగా ఉంటే సార్వత్రిక ఎన్నికల సమయంలో మరింత పేట్రేగిపోతారని తాజాగా పవన్ మాట్లాడుతూ అన్నారు. కాబట్టి ధైర్యంగా నిలబడదామన్నారు. మీ పరిధిలో నామినేషన్ వేసేందుకు ఎదురైన ఇబ్బందులను, ఎదుర్కొన్న దాడులను వివరంగా తెలియచేయండని జనసేన కార్యకర్తలను కోరారు.
పలు చోట్ల మన అభ్యర్థులపై దాడికి దిగడం, నామినేషన్ వేశాక బలవంతంగా విత్ డ్రా చేయించడం లాంటివి నా దృష్టికి వచ్చాయన్నారు. రాయలసీమలో పి.ఏ.సి. సభ్యులు హరిప్రసాద్, మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యలపై దాడి చేశారని, మన కూటమిలో భాగమైన బి.జె.పి. అభ్యర్థి మనెమ్మపై కత్తితో దాడి చేస్తే చేతికి బలమైన గాయమైందన్నారు. మన అభ్యర్థులు, నాయకులపై దాడులు చేస్తుంటే రక్షించాల్సిన పోలీసులు,
నామినేషన్ దశలో ఇబ్బందులు పాల్జేసి అడ్డుకొన్న అధికారుల వివరాలు కూడా సమగ్రంగా తెలియచేయండని ఆయన జనసేన నాయకులను కార్యకర్తలను కోరారు. స్థానిక ఎన్నికల్లో చోటు చేసుకున్న హింస, దౌర్జన్యాలు సంఘటనల వారీగా, మీపై దాడులు చేసి ఇబ్బందిపెడుతున్నా రక్షించని అధికారులు, నామినేషన్ దశలో ఆర్.ఓ.ల వ్యవహార శైలిపై వివరాలు పార్టీ కేంద్ర కార్యాలయానికి సత్వరమే పంపించండని… వీటిని క్రోడీకరించి స్వయంగా కేంద్ర హోమ్ శాఖకు అందచేస్తానని పవన్ ఇటీవల వ్యాఖ్యానించారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్తా అన్నారు. అయితే ఆయన ఎప్పుడు వెళ్తారు అనేది స్పష్టత లేదు.