స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ తీరుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. రాజకీయంగా బలంగా ఉన్న ఆ పార్టీ టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని బుధవారం మాచర్లలో చేసిన దాడి ఆందోళన కలిగించే అంశం. దీనిపై అన్ని పక్షాల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేసారు. అధికార పార్టీ వైఖరిని తప్పుబట్టారు.
ప్రజాస్వామ్యంపై వైసీపీకి గౌరవం లేదని పవన్ ఆరోపించారు. దౌర్జన్యంతో ఎన్నికలను గెలవాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. ఇతర పార్టీల నేతలను నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. కొన్నిచోట్ల దాడులు జరిగాయన్న ఆయన… 151 సభ్యులన్న వైసీపీకి ఇంత భయం ఎందుకు? అని ప్రశ్నించారు. కొందరు పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
దెబ్బలు తిన్నా గానీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేయండని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. బీహార్ లాంటి పరిస్థితులు ఏపీలో వచ్చాయని చాలా మంది అంటున్నారని, ఏపీలో ఇంత హింసను ఎప్పుడూ చూడలేదని పవన్ మండిపడ్డారు. వైసీపీ దౌర్జన్యాలకు ఎన్నికల అధికారులకే బాధ్యత వహించాలని సూచించారు. శేషన్ లాంటి అధికారులు ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.