గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇప్పటం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు రోడ్డుకు అడ్డంగా కంచెలు ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు కుట్రపూరితంగానే కంచెలు ఏర్పాటు చేస్తున్నారని జనసేన అభిమానులు ఆరోపిస్తున్నారు. పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో ఇప్పటంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటం గ్రామంలో జనసేన మద్దతుదారుల ఇళ్లు ధ్వంసం చేశారని, బస్సు లేని గ్రామానికి 100 అడుగుల రోడ్డు పేరుతో ఇళ్ళు కూల్చివేయడంపై ఇప్పటికే పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలాలు ఇచ్చారనే అక్కసుతో 53 ఇళ్లను కూల్చివేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. మరోవైపు మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామాభివృద్ధి కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సొంతంగా రూ.50లక్షల సాయం ప్రకటించారు.
ఆ నిధులు సీఆర్డీఏకు అప్పగించాలని అధికారులు కోరడంతో గ్రామస్తులు నిరాకరించారని జనసేన ఆరోపిస్తోంది. సొంత డబ్బులతో గ్రామంలో నిర్మించతలచిపెట్టిన ఆడిటోరియానికి వైఎస్ఆర్ పేరు ఎందుకు పెట్టాలని ప్రశ్నించడంతో తమ ఇళ్లు కూలగొట్టారని జనసేన అభిమానులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో జనసేన అభిమానులను పరామర్శించేందుకు జనసేన అధినేత వస్తుండటంతో స్థానికంగా టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి. అటు తనను హత్య చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని పవన్ కళ్యాణ్ ఆరోపించిన నేపథ్యంలో ఆయన భద్రతకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.