అయోధ్య విషయంలో ఇప్పుడు సుప్రీం తీర్పుపై పలు రాజకీయ పక్షాలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నాయి. తీర్పుని దేశ విజయంగా పేర్కొంటూ పలువురు రాజకీయ ప్రముఖులు వ్యాఖ్యలు చేస్తున్నారు. దశాబ్దాలుగా పరిష్కారం దొరకని సమస్యకు సుప్రీం కోర్ట్ పరిష్కారం చూపించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలు హిందుత్వ సంస్థలు, రాజకీయ పార్టీలు అటు సోషల్ మీడియాలో ఇటు ప్రధాన మీడియాలో అయోధ్య తీర్పుని సమర్ధిస్తూ ఇది ఎవరి ఓటమి, ఎవరి విజయమూ కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్ ఈ తీర్పుని సమర్ధించారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సహకరించాలి అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. ఆగస్ట్ నెల నుంచి వాదనలు నడుస్తున్న ఈ వ్యవహారంలో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రపంచానికే ఆదర్శమని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ప్రతీ ఒక్కరు రాజ్యాంగాన్ని అనుసరించాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా దీనిపై స్పందించారు. ప్రజలు అందరూ సంయమనం పాటించాలని జగన్ విజ్ఞప్తి చేసారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒకరి విజయం,
మరొకరి పరాజయంగా చూడకూడదన్న ఆయన ఒకరకంగా చెప్పాలంటే ఇది భారతీయుల విజయమని కొనియాడారు. సుప్రీమ్ తీర్పుని ప్రజలంతా గౌరవించిన తీరే ఇందుకు నిదర్శనమని పవన్ అభిప్రాయపడ్డారు. ఆసేతు హిమాచలం శాంతంగా ప్రశాంతంగా ఉందంటే ఇది దేశ విజయమే కదా అంటూ పవన్ వ్యాఖ్యానించారు. శతాబ్దాల నుంచి అపరిష్కృతంగా ఉన్న వివాదానికి ఒక ముగింపు అన్న ఆయన దేశమంటే మట్టి కాదోయ్,దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటల్ని మనం మననం చేసుకోవాలిని తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.