పవన్ కళ్యాణ్‌కు అత్యంత ఇష్టుడు అయిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో అజ్ఞాతవాసి సినిమా వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఎన్నికలకు ముందు పవన్ చేసిన సినిమా కావడంతో జనసేన, పవన్ అభిమానులు ఈ సినిమాపై పెట్టుకున్న ఆశలు అడియాసలు అయ్యాయి. అయితే ఆ సినిమా సమయంలోనే పవన్ అజ్ఞానవాసి అంటూ ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు పవన్ పొలిటికల్‌గా కూడా అజ్ఞానవాసేనా ? అన్న చర్చలు నడుస్తున్నాయి.
2014 ఎన్నికల్లో పవన్ బీజేపీ – టీడీపీ కూటమికి సపోర్ట్ చేశాడు. గత ఎన్నికల్లో పవన్ ఆ కూటమి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయాడు. చివరకు తాను సైతం రెండుచోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓడిపోక తప్పలేదు. గత ఎన్నికల్లో ఓడాక పవన్ వెళ్లి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా పవన్ వ్యవహరిస్తోన్న తీరు ఆయన అనాలోచిత రాజకీయాలకు నిదర్శనంగా మారింది. కేంద్ర నాయకత్వంతో చెలిమి చేస్తోన్న పవన్ ఇటు బీజేపీ రాష్ట్ర నాయకత్వాలతో మాత్రం విబేధిస్తోన్నాడు.
అమరావతి రైతులను కించపరిచేలా మాట్లాడారంటూ పరోక్షంగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. ఇక గ్రేటర్ ఎన్నికల్లో ముందు ఒంటరి పోరు అన్నారు.. ఆ తర్వాత కలిసి పోటీ చేస్తామని చెప్పారు. బీజేపీ జాతీయ నాయకత్వం వేరు, రాష్ట్రాల నాయకత్వం వేరు అన్నట్టుగా పవన్ పొత్తులు ఉన్నాయి. పైగా బీజేపీ జాతీయ నాయకత్వం ఓ స్టేట్‌మెంట్ ఇస్తే.. దానిపై నిలబడుతుందని.. అయితే దానిని రాష్ట్ర నాయకత్వం ఎంత వరకు ప్రజల్లోకి తీసుకు వెళుతుందన్నది వాళ్లపైనే ఆధారపడి ఉంటుందని పవన్ చెపుతోన్న పరిస్థితి.
ఆంధ్రా రాజధాని అమరావతే అని బీజేపీ జాతీయ నాయకత్వం చెప్పినా… దానిని రాష్ట్ర నాయకత్వం జనాల్లోకి తీసుకెళ్లడం లేదని విమర్శిస్తోన్న పవన్ ఢిల్లీలో మిత్రులం… అమరావతిలో శత్రువులం అన్న ధోరణినినే బీజేపీతో కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేనను సంప్రదించకుండానే తాము పోటీ చేస్తామని బీజేపీ ప్రకటిచేసింది. దీనిని బట్టి బీజేపీ కూడా పవన్‌ను పట్టించుకోవడం లేదని అర్థమవుతోంది. ఏదేమైనా పవన్ రాజకీయాలు అర్థం కాకుండా కలగాపులగంగా మారాయి.